- గతేడాది పర్సంటైల్ 94… ఈసారి 92 ఉండొచ్చు
సహనం వందే, హైదరాబాద్:
జేఈఈ మెయిన్–2025లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ కొంత తగ్గే అవకాశం ఉంది. 2024లో జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్ 94 ఉండగా, ఈసారి అది 92 ఉండొచ్చని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లలోనూ ప్రశ్నలు గతం కంటే కొద్దిగా కష్టతరంగా ఉండటమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలు ఈ మంగళవారం ముగిశాయి. దాదాపు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు లక్షన్నర మంది ఉంటారని అంచనా.
మ్యాథమెటిక్స్‌లో 20 మార్కులతో…
ఈసారి మ్యాథమెటిక్స్‌లో 20 మార్కులతో, ఫిజిక్స్‌లో 50 మార్కులతో, కెమిస్ట్రీలో 35 మార్కులతో 92 పర్సంటైల్ ఉండొచ్చని చెబుతున్నారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్‌లో 35 మార్కులు, ఫిజిక్స్‌లో 45 మార్కులు, కెమిస్ట్రీలో 65 మార్కులతో 99 పర్సంటైల్‌ను ఆశించొచ్చని అంటున్నారు. జేఈఈ–మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం కొద్దిస్థాయిలో కష్టతరంగా ఉందని నిపుణులు చెప్పారు. మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని, కెమిస్ట్రీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయన్నారు. ఫిజిక్స్‌లో కూడా ఓ మాదిరి కఠినంగానే ప్రశ్నలు అడిగారని తెలిపారు.