అసెంబ్లీ సాక్షిగా తెలుగుపై సాంస్కృతిక దాడి
– హైదరాబాద్ హిందీ నగరంగా మారుతుంది
– ఈ దుస్థితి తెలుగు అస్తిత్వానికి పెను ముప్పు!
– సిటీలో తెలుగులో మాట్లాడేవారు 40 శాతమే
– ఉత్తరాది వలసలు, వ్యాపారాలతో అధోగతి
– పదో తరగతిలో హిందీ ఫెయిల్ అయ్యేవారు ఎక్కువే
– విద్యార్థుల మెడకు త్రిభాషా సూత్రం అమలు
– మ్యూజియం భాషగా తెలుగు మారకముందే మేల్కొనాలి
– హిందీ దురాక్రమణను తిప్పి కొట్టాలని ‘సౌత్ సేన’ నేతలు శ్రీనివాస్, పృథ్వి, శ్రీకాంత్ పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
‘ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తనకు తెలుగు రాదని గర్వంగా చెప్పడం, మంత్రి సీతక్కకు హిందీ, ఇంగ్లీష్ రాదని అవహేళన చేయడం దారుణం! అంతేకాదు నేను హిందీలో మాట్లాడి ఏదో చెప్తే ఆమె మరోలా అర్థం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రంలో ఓవైసీకి తెలుగు రావాలి. అది తెలుగు జాతి గౌరవం. ఆయనకు తెలుగు రాకపోవడం అవమానం. కానీ సీతక్కకు హిందీ రావాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ స్వాభిమానం! తెలుగు రాష్ట్రంలో తెలుగును అవమానించే ఈ హిందీ గర్వం సహించరానిది. ఈ ఘటన తెలుగు భాషపై జరుగుతున్న సాంస్కృతిక దాడికి పరాకాష్ఠ!
హైదరాబాద్‌లో హిందీ రాజ్యం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హిందీ భాష ఒక ప్రమాదకరమైన సాంస్కృతిక దాడికి తెగబడుతోంది. తెలుగు భాష, సంస్కృతికి జీవనాధారంగా ఉండాల్సిన ఈ నగరం, హిందీ విషపు కోరల్లో చిక్కుకుని నలిగిపోతోంది. ఇది కేవలం భాషా సమస్య కాదు. తెలుగు జాతి ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుర్మార్గపు కుట్ర! ఈ దురాక్రమణను నిలువరించకపోతే, తెలుగు భాష అంతరించిపోయి, హైదరాబాద్ ఒక హిందీ సాంస్కృతిక సామ్రాజ్యంగా మారిపోతుంది.
క్షీణిస్తున్న తెలుగు…
హైదరాబాద్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య క్షీణిస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మార్వాడీలు ఉండే ప్రాంతాల్లో తెలుగు భాష ఒక అనాథగా మారింది. నగర జనాభాలో 60 శాతానికి పైగా హిందీ, ఇంగ్లీష్ భాషల మోజులో పడిపోయారు. దుకాణాలు, రెస్టారెంట్లు, ఆటోలలో తెలుగు మాట వినడం దుర్లభమైంది. భాషా నిపుణుల అంచనా ప్రకారం, తెలుగు భాష వినియోగం 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఈ ధోరణి కొనసాగితే, రాబోయే దశాబ్దంలో తెలుగు మాట్లాడేవారు అల్పసంఖ్యాకులుగా మారిపోతారు. ఇది తెలుగు జాతికి తీరని అవమానం.
హిందీ ఆధిపత్యానికి మూల కారణాలు…
హైదరాబాద్‌లో హిందీ ఆధిపత్యానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుండి వస్తున్న వలసదారులు హిందీని వ్యాపింప చేస్తున్నారు. తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐటీ సంస్థలు, వ్యాపార కేంద్రాలు హిందీని “సౌలభ్య భాష”గా ప్రచారం చేస్తూ, తెలుగును అణగదొక్కుతున్నాయి. హిందీ సినిమాలు, టీవీ ఛానెళ్లు యువతను హిందీ సంస్కృతికి బానిసలుగా మారుస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని రుద్దడం వల్ల తెలుగు విద్యార్థులపై హిందీ భారం పెరిగి, మాతృభాషను నేర్చుకునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ దుష్ట శక్తులన్నీ కలిసి తెలుగు భాషను నిర్మూలించడానికి కుట్ర పన్నుతున్నాయి!
విద్యార్థుల భవిష్యత్తు అంధకారం…
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులపై హిందీ ఒక శాపంగా మారింది. 10వ తరగతి పరీక్షల్లో వేలాది మంది విద్యార్థులు హిందీలో ఫెయిల్ అవుతున్నారు. గ్రామీణ విద్యార్థులకు హిందీ భాష ఒక పీడకలలా మారింది. ఈ అనవసర ఒత్తిడి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
హిందీపై దక్షిణాది తిరుగుబాటు…
దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు హిందీ దురాక్రమణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ భాషా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పోరాటంలో చేతులు కలపాలి. మన భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి మనం కూడా గట్టిగా నిలబడాలని సౌత్ సేన ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కోశాధికారి కమటం రమేష్ (పృద్వి), ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
నిర్లక్ష్యం కొనసాగితే మ్యూజియంలోనే…
ప్రభుత్వం తెలుగును తప్పనిసరి చేస్తామని ప్రకటనలు చేస్తోంది, కానీ చర్యలు శూన్యం. వలస వచ్చినవారు తెలుగు నేర్చుకోవాలనే నిబంధనలు లేవు. ఐటీ సంస్థలు, వ్యాపారులు తెలుగును ప్రోత్సహించడం లేదు. ఈ నిర్లక్ష్యం కొనసాగితే, హైదరాబాద్ ఒక హిందీ నగరంగా మారుతుంది. తెలుగు సంస్కృతి, సాహిత్యం, చరిత్ర అన్నీ మరుగున పడిపోతాయి! నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే తెలుగు మ్యూజియంలో ఒక పురాతన వస్తువుగా చూసే భాషగా మారుతుందని భాష శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగును రక్షించుకోవాల్సిన సమయం…
తెలుగును కాపాడుకోవడానికి, మనం వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. వ్యాపారాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సినిమా, మీడియాలో తెలుగు కంటెంట్‌ను పెంచాలి. కుటుంబాలలో పిల్లలకు తెలుగు మాట్లాడే అలవాటు చేయాలి. ప్రభుత్వం త్రిభాషా సూత్రంపై పునఃపరిశీలన చేయాలి. హిందీని ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చాలి.
హిందీ దురాక్రమణను తిప్పికొట్టండి! హైదరాబాద్‌లో హిందీ సాంస్కృతిక ఆధిపత్యం కేవలం భాషా మార్పు మాత్రమే కాదు, ఇది తెలుగు జాతి ఆత్మను నాశనం చేసే దుష్ట ప్రయత్నం! ఇప్పుడు మనం మౌనంగా ఉంటే, మన భాష, మన సంస్కృతి చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలిపోతాయి. తెలుగువారందరూ ఏకమై ఈ దాడిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే, మన అస్తిత్వాన్ని మనమే నాశనం చేసుకున్న వారిగా మిగిలిపోతాం.