14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

Share

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు
– కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది

సహనం వందే, ఢిల్లీ:
భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
వైద్య రికార్డులను అనుసంధానం చేసే సంఖ్య…
ఏబీహెచ్ఏ అనేది 14 అంకెల ప్రత్యేక సంఖ్య. ఇది రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు వంటి ఆరోగ్య సంస్థల మధ్య అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా రోగులు తమ వైద్య రికార్డులను కాగితాలపై తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు వైద్యులు రోగుల పూర్తి వైద్య చరిత్రను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ వ్యవస్థలో రోగుల గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రోగుల అనుమతి లేకుండా వారి డేటాను ఇతరులకు ఇవ్వరు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరం…
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, దీర్ఘకాలంగా చికిత్స పొందుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోగులు తమ ల్యాబ్ ఫలితాలు, ప్రిస్క్రిప్షన్లు, చికిత్సా ప్రణాళికలను ఏబీడీఎం అధీకృత పర్సనల్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్) యాప్‌ల ద్వారా తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. రోగులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ ఆరోగ్య సమాచారాన్ని ఆసుపత్రులు, ఫార్మసీలతో పంచుకోవచ్చు. దీని ద్వారా ఆసుపత్రులలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. ఫార్మసీలలో మందులు కొనుగోలు చేయడం వేగవంతం అవుతుంది. పేపర్‌ వర్క్ తగ్గుతుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ మరింత సౌకర్యవంతం అవుతుంది. రోగుల వైద్య చరిత్ర కేవలం కొన్ని సెకండ్లలోనే వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల పునరావృత పరీక్షల అవసరం తగ్గుతుంది.

సులభమైన నమోదు ప్రక్రియ
ఏబీహెచ్ఏ నమోదు ప్రక్రియ కేవలం ఐదు నిమిషాలలో పూర్తవుతుంది. తర్వాత ఏదైనా ఏబీడీఎం అధీకృత పీహెచ్ఆర్ యాప్ ద్వారా వైద్య రికార్డులను లింక్ చేయాలి. తద్వారా ఆరోగ్య సేవలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 76 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు సృష్టించబడ్డాయి. 50.9 కోట్ల ఆరోగ్య రికార్డులు లింక్ చేయబడ్డాయి. ఇది కాగిత రహిత, రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ వైపు అతిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *