సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం

Share

   ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు
– అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల్లో, పర్యావరణవాదుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

భూమి కోసం విద్యార్థుల పోరాటం…
హెచ్‌సీయూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్చి 30 రాత్రి బుల్డోజర్లు ఈ భూమిని చదును చేయడానికి రాగానే విద్యార్థులు నిరసనలు చేపట్టారు. “ఈ భూమి యూనివర్సిటీది, దీన్ని కాపాడుకోవడం మా హక్కు” అని విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ నిరసనల సమయంలో పోలీసులు దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్టు చేసి, సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు బుల్డోజర్లపై ఎక్కి “గో బ్యాక్” నినాదాలు చేసిన దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగించాయి.

భూమి యాజమాన్య వివాదం…
తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి చెందినది కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని వాదిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, “ఈ భూమి ఐటీ హబ్‌లో భాగం, యూనివర్సిటీకి సంబంధం లేదు” అని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా, “ఈ భూమి ప్రభుత్వ రికార్డుల్లో సర్కారీ ఆస్తిగా ఉంది” అని స్పష్టం చేశారు. 2004లో ఈ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడి తిరిగి స్వాధీనం చేసుకుందని అధికారులు చెప్పారు. అయితే, విద్యార్థులు ఈ వాదనను తిరస్కరిస్తూ, “ఈ భూమి యూనివర్సిటీ స్థాపన సమయంలో కేటాయించిన 2,300 ఎకరాల్లో భాగం” అని పేర్కొన్నారు.

జీవవైవిధ్యానికి ముప్పు…
ఈ 400 ఎకరాల భూమి పచ్చని అడవులు, జీవవైవిధ్యంతో నిండి ఉంది. ఇక్కడ జింకలు, నెమళ్లు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తాయి. ఈ భూమిని సమం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నారు.

ధర్నాకు సీపీఎం పిలుపు
హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసుల నిర్బంధాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థి నాయకులు ఎర్రం నవీన్‌తో పాటు, మరో విద్యార్థి నాయకుడ్ని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌ చేశారని, వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలని కోరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర మంగళవారం ఉదయం 11 గంటలకు ధర్నాకు పిలుపునిచ్చింది.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *