డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

Share

   చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
– మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో కీలక ప్రసంగం
– దక్షిణాది జనాభా పెరగకపోతే ఉత్తరాది నుంచి వలసలు వస్తాయని హెచ్చరిక

సహనం వందే, చెన్నై
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో శుక్రవారం జరిగిన “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొనే రాజకీయ అసమతుల్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. “జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది” అని హెచ్చరించారు.

దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ అన్యాయం
చాలాకాలంగా కుటుంబ నియంత్రణ విధానాలను పాటిస్తూ, జనాభా పెరుగుదలని అదుపులో ఉంచిన దక్షిణాది రాష్ట్రాలు, ఇప్పుడు డీలిమిటేషన్ కారణంగా రాజకీయంగా వెనుకబడే ప్రమాదం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “జనాభా పెరిగిన ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే, అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

జనాభా పెంపుదలపై వ్యాఖ్యలు…
“పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై మనం ఆలోచించాలి. లేకపోతే, నార్త్ ఇండియా జనాభా పెరిగి, అక్కడి ప్రజలు దక్షిణాదికి వలస వెళతారు” అని చంద్రబాబు హెచ్చరించారు. “చదువుకున్న యువత పెళ్లిళ్లు చేసుకోకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ, ఆ ఆలోచనను మార్చుకోవాలి. జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసించగలుగుతాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగు విద్యార్థుల ప్రతిభపై ప్రశంసలు…
ఐఐటీ మద్రాస్‌లో 30-40% విద్యార్థులు తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయమని చంద్రబాబు అన్నారు. “మద్రాస్ ఐఐటీ దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. ఇక్కడ స్టార్టప్‌లు 80% విజయశాతం సాధిస్తున్నాయి” అని పేర్కొన్నారు. అగ్నికుల్ స్టార్టప్ విజయాన్ని ప్రస్తావిస్తూ, “భారతదేశ యువత అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకుంటోంది” అని చంద్రబాబు ప్రశంసించారు.

భారత భవిష్యత్తుపై విశ్వాసం
భారత్‌కు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, మరో 40 ఏళ్లపాటు దేశ ఆర్థిక పురోగతి అప్రతిహతంగా కొనసాగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని ధీమా వ్యక్తం చేశారు.

జనాభా తగ్గుదల – ప్రపంచ దేశాలకు ముప్పు
జపాన్, చైనా, యూరప్ వంటి దేశాలు జనాభా తగ్గుదల వల్ల ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయని, కానీ భారత్‌కు అలాంటి సమస్యలు లేవని చంద్రబాబు స్పష్టంచేశారు. “ఆర్థిక సంస్కరణలు దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. 1991 సంస్కరణలు ఎంపిక కాదు, తప్పనిసరి” అని గుర్తు చేశారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, యువత తమ బాధ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. “దేశ పురోగతికి యువతే పునాది. వారు ఆలోచనలో మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది” అని వ్యాఖ్యానించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *