బీజేపీ ‘ఇఫ్తార్ దౌత్యం’

  ‘సౌగాత్-ఈ-మోదీ’తో కొత్త ఎత్తుగడ
– బీహార్ ఎన్నికల వేళ ముస్లిం ఓటర్లపై వల
– 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ

సహనం వందే, ఢిల్లీ:
పొద్దున్నే లేస్తే ముస్లింలను పనిగట్టుకుని విమర్శించే బీజేపీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింలకు దూరంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు రంజాన్ సమయంలో ముస్లింలకు ప్రత్యేక వసతులు కల్పించడం పైన, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చిపోయే వేళల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం పైన బీజేపీ కార్యకర్తలు భగ్గుమంటున్న వేళ ఇప్పుడు అదే పార్టీ రంజాన్ కు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సౌగాత్-ఈ-మోదీ’ పేరుతో 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఇందుకు నిదర్శనం. బీజేపీ మైనారిటీ మోర్చా చేపట్టిన ఈ కార్యక్రమం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్-నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ముస్లింల మద్దతును పొందడమే ఈ కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రాష్ట్రంలో 17.7 శాతం మంది ముస్లింలు ఉండటం గమనార్హం.
ఆ కిట్లలో ఏమున్నాయి?
ఈ కిట్లలో ముస్లిం కుటుంబాల కోసం ఆహార పదార్థాలు, వస్త్రాలు, పండ్లు, వెర్మిసెలీ, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉన్నాయి. మహిళల కోసం సూట్ కట్టింగ్ ఫాబ్రిక్, పురుషుల కోసం కుర్తా-పాయిజామా అందించనున్నారు. ఒక్కో కిట్ విలువ సుమారు రూ. 600 వరకు ఉంటుందని సమాచారం.
32 వేల మసీదుల ద్వారా పంపిణీ…
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భాజపా మైనారిటీ మోర్చా కార్యకర్తలు దేశవ్యాప్తంగా 32,000 మసీదులను సంప్రదించి లబ్ధిదారులకు ఈ కిట్లను అందించనున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ పథకాన్ని ప్రారంభించారు.
మత సామరస్యమా? రాజకీయ వ్యూహమా?
ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం ప్రజలకు భాజపా తాము అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖీ చెబుతున్నారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని మతపరమైన వేడుకల్లో పాల్గొంటారు. ప్రతి భారతీయుడిని ఒకటిగా చూడాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం” అని ఆయన అన్నారు. అయితే, ఈ కార్యక్రమం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇతర మైనారిటీలకూ విస్తరణ…
ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఇతర మతపరమైన పండుగలకు కూడా విస్తరించనుంది. క్రైస్తవుల కోసం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక కిట్లు, పార్సీలకు నవ్రోజ్ పండుగకు సంబంధించి బహుమతులు అందజేయనున్నట్లు భాజపా ప్రకటించింది.
ముస్లిం ఓటర్లు ఆదరిస్తారా?
గతంలో కూడా బీజేపీ అజ్మీర్ షరీఫ్, నిజాముద్దీన్ దర్గా వంటి పవిత్ర ప్రదేశాలకు చాదర్ పంపించింది. కానీ, ఈసారి ప్రత్యక్షంగా ముస్లిం సామాజిక వర్గానికి ఆర్థిక సహాయం అందించడంతో పార్టీకి కొత్త మైనారిటీ ఓటర్లు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమం ముస్లిం సమాజంలో బీజేపీకి ఆదరణను పెంచుతుందా? లేక ఎన్నికల ప్రాతిపదికన మాత్రమే చేపట్టిన చర్యగా మిగిలిపోతుందా? అన్నది చూడాల్సి ఉంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *