ఒక్కో ఉద్యోగికి 900 కోట్లు – రాత్రికి రాత్రే 5,100 మంది కోటీశ్వరులు

Anthropic Shares Value
  • ప్రపంచాన్ని కుదిపేసిన ఆంథ్రోపిక్ కంపెనీ
  • నెల జీతం నుంచి వందల కోట్ల సంపాదన
  • స్టాక్ మార్కెట్‌లో కనీవినీ ఎరుగని జాక్‌పాట్!
  • ఐదేళ్ల చిన్న సంస్థ.. 155 లక్షలకోట్ల సంపద
  • ప్రతి వంద మందిలో 96 మంది కోటీశ్వరులు

సహనం వందే, అమెరికా:

ఒక ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుంది. కొంచెం పొదుపు చేస్తే పదేళ్లకో, ఇరవై ఏళ్లకో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. ఇదే మనకు తెలిసిన లెక్క! కానీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఏకంగా రూ.900 కోట్లు సంపాదించవచ్చంటే నమ్ముతారా? అదీ లాటరీ కాదు.. అదృష్టం కొద్దీ వచ్చిన ఆస్తి కాదు.. కంపెనీలో పనిచేసినందుకు వచ్చిన వాటాల విలువ!

అమెరికాలోని ఆంథ్రోపిక్ అనే ఏఐ సంస్థ ఇప్పుడు ఇదే సంచలనం సృష్టించింది. నిన్నటివరకు ఉద్యోగులుగా ఉన్నవాళ్లు.. ఈరోజు వందల కోట్ల ఆస్తులున్న సంపన్నులుగా మారిపోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 5,100 మంది! వారి వద్ద రూ.9 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. అంటే ప్రతి వంద మందిలో 96 మంది కోటీశ్వరులు. దాదాపు 2,800 మందికి రూ.90 కోట్లకు పైగా, 600 మందికి రూ.900 కోట్లకు పైగా వాటాలు ఉన్నాయి. వీరంతా వ్యవస్థాపకులు కాదు, సాధారణ ఉద్యోగులే. 2021లో మొదలైన ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐతో వేగంగా ఎదిగింది. 2024 చివరికి వెయ్యిలోపు ఉన్న సిబ్బంది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,300కు చేరారు.

షేర్ల విలువ ఎలా పెరిగింది?
ఆంథ్రోపిక్ షేరు ధరను 83 డాలర్లుగా నిర్ణయించింది, ఇది సుమారు రూ.7,400కు పైమాటే. ఉద్యోగులకు ముందుగానే వాటాలు ఇవ్వడం వల్ల కంపెనీ ఎదుగుదలతో వారి ఆస్తి పెరిగింది. ముఖ్యంగా 2023, 2024లో చేరినవారికి భారీ లాభం వచ్చింది. కొన్ని పాత స్టాక్ ఆప్షన్ల ధర కేవలం 52 సెంట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడవి వేల రూపాయలకు చేరాయి. ప్రతిభను నిలుపుకోవడానికి సంస్థలు ఇచ్చే వాటాల సూత్రమే ఇక్కడ పనిచేసింది.

చేతిలో నగదు.. కంపెనీ విలువ!
షేర్ల విలువ పెరిగినంత మాత్రాన వెంటనే అంతా నగదు రాదు. షేర్లు అమ్మితేనే, పన్నులు పోగా డబ్బు చేతికొస్తుంది. ఆంథ్రోపిక్ మొదటి రోజు 10 శాతం, ఫలితాల తర్వాత మరో 35 శాతం అమ్మే అవకాశం ఇచ్చింది. ట్రేడింగ్‌లో షేరు 111 డాలర్లు దాటి, తొలి రోజు 97.17 డాలర్ల వద్ద నిలిచింది. దీంతో మార్కెట్ విలువ సుమారు 1.75 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.155 లక్షల కోట్లకు చేరింది.

ఉద్యోగుల నిర్ణయాలు.. కొత్త సవాళ్లు!
ఇంత సంపద వచ్చాక ఉద్యోగులు కొనసాగుతారా, కొత్త సంస్థలు పెడతారా అనేది ఆసక్తికరం. ప్రతిభావంతులను నిలుపుకోవడం కంపెనీకి పెద్ద సవాలు. మనుషులు, నైపుణ్యాలే సంస్థను నిలబెడతాయి. జీతం అవసరాలు తీరుస్తుంది, సరైన వాటా జీవితాన్నే మారుస్తుంది. మన దేశంలోనూ ఉద్యోగులకు వాటాలిచ్చే సంస్కృతి పెరగాలా?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *