సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… హీరోయిన్ అవకాశం – అమెరికా నుంచి ‘ఆకాశంలో ఒక తార’

Akasamlo oka Tara Sathwika
  • వెండితెరకు ఇంజనీర్ సాత్విక వీరవల్లి
  • అమెరికాలో విద్యాభ్యాసం, ఉద్యోగం
  • కృష్ణా జిల్లా మూలాలు… అనుకోకుండా హీరోయిన్‌
  • ఒక్క వీడియోతో సినిమా అవకాశం
  • దుల్కర్ సల్మాన్ నటన సూచనలు
  • సుకుమార్ సినిమాలో ఛాన్స్ ప్రచారం

సహనం వందే, హైదరాబాద్:

అమెరికాలోని చికాగోలో పుట్టి పెరిగిన సాత్విక వీరవల్లికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో కుటుంబ మూలాలున్న ఆమె తండ్రి, చదువుల కోసం తొలుత హైదరాబాద్‌కు వచ్చి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇంట్లో తెలుగు, తమిళ సంప్రదాయాల వాతావరణం ఉండగా, తమిళ సంస్కృతిపై ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. గత రెండేళ్లుగా తెలుగు భాష నేర్చుకుంటున్న సాత్విక, ఉన్నత చదువులు పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో చేరారు. దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్, రుహానీ శర్మలతో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటించారు.

వీడియోతో మారిన మలుపు
సోషల్ మీడియాలో సాత్విక వీరవల్లి పెట్టిన ఓ వీడియో ‘కాంతా’ నిర్మాతల్లో ఒకరిని ఆకర్షించి ఆడిషన్‌కు దారితీసింది. అందులో ఎంపిక కాకపోయినా, ఆ వీడియో చూసిన దర్శకుడు పవన్ సాదినేని ‘ఆకాశంలో ఒక తార’ కోసం అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 2024లో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు. షెడ్యూళ్ల మధ్య సహనటులు ఇతర చిత్రాలతో బిజీ అయినా, తొందరపడకుండా సహనంతో ఎదురుచూశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

చదువుతో పాటు కళాభిరుచి
నాష్‌విల్లేలోని వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ పూర్తి చేసిన సాత్విక, పీహెచ్‌డీ లేదా ఎంబీఏ ఆలోచనలో ఉండేవారు. ఉద్యోగం, చదువు మధ్య సృజనాత్మకతకు అవకాశం తక్కువని భావించిన ఆమె, న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తూనే కళారంగంలో ఉన్నవారిని చూసి ప్రేరణ పొందారు. చికాగోలో తల్లి వద్ద భరతనాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకోవడం, ముఖ్యంగా నృత్యంపై ఆసక్తి కళాభిరుచిని పెంచాయి.

దుల్కర్ సల్మాన్ నటన పాఠాలు
నటనలో అనుభవం లేని సాత్వికకు చిత్రబృందం సంభాషణలు, భావవ్యక్తీకరణపై శిక్షణ ఇచ్చింది. చుట్టూ ఉన్నవారి ప్రవర్తన, హావభావాలను గమనించాలని, ఫలితాలతో సంబంధం లేకుండా ఎంచుకున్న సినిమాకు కట్టుబడి ఉండాలని దుల్కర్ సల్మాన్ సూచించారు. పాశ్చాత్య సంస్కృతిలో గొంతు, వేగంతో భావాలు చూపిస్తే, తూర్పు దేశాల్లో ముఖ కవళికలు, చేతులు, శరీర కదలికలతో వ్యక్తపరుస్తారని ఆమె గ్రహించారు. ఈ తేడాలను అర్థం చేసుకుని పాత్ర మనస్తత్వానికి తగ్గట్టుగా నటించడాన్ని సవాలుగా తీసుకున్నారు.

కల్పన పాత్ర, కొత్త అవకాశాలు
‘ఆకాశంలో ఒక తార’లో వ్యోమగామి కావాలనే కల ఉన్న చిన్న పట్టణపు యువతి కల్పన పాత్రలో సాత్విక కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ రావచ్చని ప్రచారం జరుగుతోంది. కొన్ని నిర్మాణ సంస్థలతో చర్చలు సాగుతున్నాయని, కొన్ని వార్తలు ప్రచారమే అయినా మరికొన్ని ప్రాజెక్టులు ఖరారయ్యాయని ఆమె తెలిపారు. పెద్ద ప్రణాళికలు లేకుండా నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ సహనంతో ముందుకు సాగుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *