- కేంద్ర ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించిన నేరగాళ్లు!
- నకిలీ ముద్రలతో 129 వెబ్సైట్ల బ్లాక్!
- క్యూ ఆర్ కోడ్‌తో అధికారులకు మాయ!
- న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు కొత్త ముప్పు!
సహనం వందే, న్యూఢిల్లీ:
ఈ ఏడాది జూలై 19వ తేదీ రాత్రి 8 గంటల 59 నిమిషాలకు టెలికాం శాఖకు ఒక ఈమెయిల్ అందింది. ఆర్యన్ చౌదరి అనే అడ్వకేట్ ఆన్ రికార్డ్ పేరుతో రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులను పంపించారు. వాటి ఆధారంగా జూలై 21న 34 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఆగస్టు 22న కార్తికేయ పాండే అనే వ్యక్తి మరో ఈమెయిల్ పంపించారు. అందులో అలహాబాద్ హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు జతచేశారు. ఈసారి 95 వెబ్సైట్లను నిలిపివేయాలని కోరారు. దీంతో సెప్టెంబర్ 2న మరోసారి నిరోధక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా రెండు సందర్భాల్లో కలిపి 129 వెబ్సైట్లు నిలిచిపోయాయి. విచిత్రమేంటంటే నకిలీ ఉత్తర్వుల ఆధారంగా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది?
జడ్జీల సంతకాలు ఫోర్జరీ…
కోర్టు తీర్పు అంటే ప్రభుత్వానికైనా, సామాన్యులకైనా ఎంతో నమ్మకం. న్యాయమూర్తి సంతకం, కోర్టు ముద్ర ఉంటే అది అధికారిక ఉత్తర్వేనని నమ్ముతాం. కానీ ఆ నమ్మకాన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టుల పేర్లతో నకిలీ ఉత్తర్వులు సృష్టించి కేంద్ర టెలికాం శాఖకు పంపించారు. అధికారిక పత్రాల్లో ఉండే జాతీయ చిహ్నం, కోర్టు ముద్రలు, న్యాయమూర్తుల వివరాలు, సంతకాలను అనుకరించారు. జడ్జీల సంతకాలను ఫోర్జరీ చేశారు. వాటిని నిజమైన ఉత్తర్వులుగా భావించిన అధికారులు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు 129 బెట్టింగ్ వెబ్సైట్లను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ చేపట్టిన పరిశోధనతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రాయిటర్స్ పరిశోధనతో బట్టబయలు!
ఈ ఉత్తర్వులపై రాయిటర్స్ ప్రత్యేక పరిశోధన చేపట్టి సంబంధిత హైకోర్టు అధికారులను సంప్రదించింది. రాజస్థాన్ హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం తమ వద్ద అలాంటి ఉత్తర్వులేవీ నమోదు కాలేదని స్పష్టం చేసింది. అవి నకిలీ పత్రాలని తేల్చింది. మరోవైపు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గరిమా ప్రసాద్ పేరుతో కూడా నకిలీ సంతకం పెట్టినట్లు గుర్తించారు. ఆమె అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని వెల్లడైంది. అంతేకాకుండా నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించేందుకు వాటిపై క్యూ ఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. సాధారణంగా ఇలాంటి కోడ్‌ను స్కాన్ చేస్తే కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లోని కేసు వివరాలు కనిపించాలి. కానీ ఈ పత్రంలోని కోడ్‌ను స్కాన్ చేస్తే మరో వెబ్‌పేజీ తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. అక్కడ కేసు నంబరుకు సంబంధించిన ఒకే ఒక్క లైన్ కనిపించేలా చేసి పత్రం నిజమైనదేనన్న భ్రమ కలిగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ శాఖలకు చేరిన పత్రాల్లోని ఈ మోసాన్ని గుర్తించలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల దర్యాప్తు.. ఏఐ ప్రమేయంపైనా ఆరా!
రాయిటర్స్ పరిశోధనతో వ్యవహారం బయటపడిన తర్వాత అలహాబాద్ హైకోర్టు అధికారులు స్పందించారు. ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ఉత్తర్వుల తయారీ, ఫోర్జరీ, మోసం వంటి అంశాలపై విచారణ సాగుతోంది. ఈ పత్రాలను ఎవరు రూపొందించారు? వీటి వెనుక వ్యక్తులు ఉన్నారా? ఏదైనా సంస్థ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ పత్రాలను తయారు చేశారా అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు వెల్లడించారు. న్యాయమూర్తుల నకిలీ సంతకాలతో తీర్పులు, ఉత్తర్వులు సృష్టించడం న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకానికి ముప్పని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ సాయంతో తప్పుడు తీర్పులు సృష్టించే ధోరణి న్యాయవ్యవస్థకు కొత్త సవాలుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ భద్రతకు బలమైన వ్యవస్థ అవసరం!
ఈ ఘటన ఒక్క టెలికాం శాఖకే పరిమితమైన సమస్య కాదు. ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయస్థానాలు, సామాజిక మాధ్యమ సంస్థలు సైతం నకిలీ అధికారిక పత్రాల ముప్పును ఎదుర్కొంటున్నాయని ఇది స్పష్టం చేస్తోంది. బెట్టింగ్ వెబ్సైట్లు చట్టవిరుద్ధమైనవే అయినప్పటికీ వాటిని నిలిపివేయడానికి చట్టబద్ధమైన ప్రక్రియనే అనుసరించాలి. నకిలీ కోర్టు ఉత్తర్వులతో బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయగలిగితే, రేపు ఇదే పద్ధతిలో ఇతర సంస్థల వెబ్సైట్లనూ లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వ శాఖలకు అందే ప్రతి అధికారిక పత్రం నిజమైనదో కాదో నిర్ధారించుకునే వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి. న్యాయస్థానాల నుంచి వచ్చిన ఉత్తర్వులను నేరుగా ధ్రువీకరించే విధానం ఉండాలి. లేదంటే నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలే ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.