- జాతీయ రాజకీయాల్లో భారీ భూకంపం!
- నవంబర్ 1న ఢిల్లీలో ఉమ్మడి పోరు
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పట్టు
- ఓటర్ల జాబితా లోపాలపై రణభేరి
- మలుపు తిరిగిన నేషనల్ పాలిటిక్స్
సహనం వందే, హైదరాబాద్:
భారత రాజకీయ యవనికపై అస్సలు ఊహించని ఒక మహామలుపు చోటుచేసుకుంది! నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకిగానీ, ఆ పార్టీ నేతృత్వంలోని పొత్తులకుగానీ పూర్తి దూరంగా ఉంటూ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఇప్పుడు ఏకంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం సీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కుదిపేస్తోంది.
ఊహించని పొలిటికల్ బిగ్ ట్విస్ట్!
ఇప్పటివరకు ఏ సాంప్రదాయ రాజకీయ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా తనదైన విలక్షణ ధోరణితో వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ, మొదటిసారిగా ఇండియా కూటమి పక్షాన నిలబడడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అభిజీత్ దీప్కే నాయకత్వంలో డిజిటల్ మాధ్యమాల్లో పెను తుఫాను సృష్టిస్తూ యువతలో అపార ఆదరణ పొందిన ఈ పార్టీ, ఏనాడూ కాంగ్రెస్ వేదికలపైకి రాలేదు. అలాంటి సీజేపీ ఇప్పుడు విపక్షాలతో చేతులు కలపడం రాజకీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
నవంబర్ 1న ‘ఇండియా’తో ఉమ్మడి శంఖారావం
నవంబర్ 1వ తేదీన ఇండియా కూటమి తలపెట్టిన భారీ నిరసన ర్యాలీకి తమ సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. యువతరం, సోషల్ మీడియా వాలంటీర్లు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి మద్దతుదారులు కూడా ప్రతిపక్షాలతో కలిసి ఒకే వేదికపైకి రానుండడంతో ఈ ర్యాలీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కలయిక ప్రతిపక్ష బలానికి కొత్త ఊపిరి పోసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టార్గెట్ జ్ఞానేశ్ కుమార్…
ఈ అనూహ్య పొత్తు వెనుక ప్రధాన సూత్రధారి కేంద్ర ఎన్నికల సంఘం తీరేనని సీజేపీ బలంగా ప్రతిపాదిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ, ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సంఘం తటస్థతను కోల్పోయిందన్న పాయింట్‌పైనే ఇప్పుడు ఇండియా కూటమి, సీజేపీలు ఒక్కటై సమరానికి సిద్ధమయ్యాయి.
ఓటర్ల జాబితా ‘గోల్మాల్’పై ఉమ్మడి యుద్ధం
ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనేది విపక్షాల మండిపాటుకు మూలకారణం. కోట్ల అర్హత కలిగిన ఓట్లను అక్రమంగా గల్లంతు చేస్తున్నారని, ఈ ‘సర్’ ప్రక్రియ మొత్తం పారదర్శకత లేకుండా సాగుతోందని సీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటింగ్ హక్కునే కాలరాస్తున్నారనే పాయింట్‌పై వీరు పోరాటాన్ని ఉధృతం చేశారు.
మారనున్న రాజకీయ సమీకరణాలు
ఇప్పటివరకు కాంగ్రెస్‌కు ఏమాత్రం సపోర్ట్ చేయని కాక్రోచ్ జనతా పార్టీ, ఈ క్రూషియల్ జంక్షన్లో ఇండియా కూటమికి అండగా నిలవడం భవిష్యత్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనుంది. నవంబర్ 1న జరగబోయే ఈ ఉమ్మడి పోరాటం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి గట్టి సవాలు విసరబోతోంది. ప్రతిపక్ష విమర్శలకు, ఈ సరికొత్త రాజకీయ సమీకరణాలకు ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.