ఐఐటీలలో సమాధుల వేట – నాలుగేళ్లలో 45 మంది విద్యార్థుల బలవన్మరణం

IIT Students Suicides
  • అందులో 62 శాతం బలిపశువులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే
  • ఐఐటీ బ్రాండ్ వెనుక కులం సౌండ్
  • మెరిట్ ముసుగులో బద్ధలవుతున్న భ్రమలు
  • వెల్లువెత్తుతున్న నిరసనలు… సంస్కరణలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో ఐఐటీలు అంటే కేవలం అత్యున్నత ప్రతిభకు, మేధస్సుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే పవిత్ర ఆలయాలుగా సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అక్కడికి వచ్చిన విద్యార్థులందరినీ కేవలం వారి సామర్థ్యం ఆధారంగానే చూస్తారని, కులమతాలకు అస్సలు చోటు ఉండదని భావిస్తుంటారు. కానీ, ఐఐటీ బొంబాయిలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న సాహిల్ వాకోడే అనే విద్యార్థి ఆత్మహత్యతో ఈ ఐఐటీల అసలు రంగు బయటపడింది. మెరిట్ అనే మాట వెనుక కుల వివక్ష భ్రమల పొరలు పూర్తిగా బద్దలయ్యాయి. సాహిల్ మరణం క్యాంపస్‌లో తీవ్ర కలకలం సృష్టించడమే కాకుండా పెను నిరసనలకు, కుల వివక్ష ఆరోపణలకు, తక్షణ వ్యవస్థాగత సంస్కరణల డిమాండ్లకు దారితీసింది.

దిగ్భ్రాంతి కలిగిస్తున్న లెక్కలు
ఐఐటీ యాజమాన్యాల నిర్లక్ష్యం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను అధికారిక లెక్కలే బయటపెడుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరం నుండి 2024-25 విద్యా సంవత్సరం మధ్య కాలంలో వివిధ ఐఐటీలలో ఏకంగా 45 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు వదిలారు. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… ఆత్మహత్య చేసుకున్న 45 మందిలో 28 మంది అంటే దాదాపు 62 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా చెలామణి అవుతున్న ఐఐటీల్లోనే ఈ స్థాయిలో అణగారిన వర్గాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండటం అక్కడి విషపూరిత వాతావరణానికి నిదర్శనం.

కుల వివక్షకు బాధ్యులు ఎవరు?
ఐఐటీల్లో అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే వరుసగా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? అసలు క్యాంపస్ సెట్టింగ్‌లో జరిగే కుల వివక్షకు ఎవరు బాధ్యత వహించాలి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కష్టపడి ప్రవేశ పరీక్షలు రాసి, స్వయం ప్రతిభతో సీట్లు సాధించి లోపలికి అడుగుపెట్టిన విద్యార్థులకు అక్కడ ఆదరణ కరువవుతోంది. మెరిట్ ముసుగులో వారి సామాజిక నేపథ్యాన్ని బట్టి చులకన భావం, మానసిక ఒత్తిడి వారిని చావు అంచులకు నెడుతున్నాయి. విద్యార్థుల మరణాలను కేవలం వారి వ్యక్తిగత బలహీనతలుగా చిత్రీకరించి ఐఐటీ యాజమాన్యాలు తప్పించుకోలేవు.

తక్షణ సంస్కరణలు తథ్యం…
కేవలం సంతాపాలు ప్రకటించడంతోనో లేదా నామమాత్రపు విచారణ కమిటీలు వేయడంతోనో ఐఐటీల బాధ్యత ముగిసిపోదు. విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించేలా, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సమగ్రమైన వ్యవస్థాగత సంస్కరణలు తీసుకురావాలి. మెరిట్ ముసుగులో సాగే వివక్షకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఐఐటీ ప్రాంగణాలు అమాయక విద్యార్థుల మరణమృదంగాలుగా మారక తప్పదు.

విద్యా వ్యవస్థకే కళంకం
ఐఐటీలలో చదువుకోవడానికి వెళ్లిన బిడ్డలు శవాలుగా తిరిగిరావడం మన విద్యా వ్యవస్థకే అతిపెద్ద కళంకం. ప్రతిభకు పట్టం కడతామని చెప్పే ఐఐటీలు, ఆ ప్రతిభ వెనుక ఉన్న కులాన్ని చూసి వేధించే సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి పలకాలి. సాహిల్ వాకోడే బలవన్మరణం, ఈ 45 మంది విద్యార్థుల త్యాగాలు విద్యాసంస్థల్లో నిజమైన మార్పునకు నాంది కావాలి. లేకపోతే మెరిట్ అనే పదం వివక్షకు మరో పేరుగా మిగిలిపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *