- వాట్సాప్ ఛానెల్ సృష్టించిన ఎన్నికల సునామీ
- లూలా విక్టరీ క్రెడిట్ అంతా ఆ ఒక్కడిదే!
- డిజిటల్ మాస్టర్ మైండ్ ఆండ్రే జానోనెస్ టాలెంట్
- కేవలం మూడు వారాల్లో కోటి మందితో ‘లూలాస్ ఆర్మీ’
సహనం వందే, బ్రెజిల్:
డిజిటల్ వార్ఫేర్ ఎంట్రీ
ఎన్నికల్లో గెలవాలంటే భారీ బహిరంగ సభలు పెట్టాలి, రోడ్ షోలు చేయాలి… ఇవన్నీ మనకు తెలిసిన పాత ముచ్చట్లు. కానీ ఒకే ఒక్క వాట్సాప్ ఛానెల్ పెట్టి, కోట్లాది మందిని క్షణాల మీద కదిలించి, దేశ అధ్యక్షుడిని గెలిపించడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా ఇదే మ్యాజిక్‌ను బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో చేసి చూపించాడు ఒక మాజీ బస్ ఫేర్ కలెక్టర్. తొలి విడత ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా కాస్త వెనుకబడటంతో, ప్రత్యర్థి వర్గం దూకుడు చూసి ఆయన గెలవడం కష్టమేనని అందరూ భావించారు. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే లూలా క్యాంపెయిన్‌లోకి ఒక కొత్త శక్తి ఎంట్రీ ఇచ్చింది. ఆయనే పార్లమెంటు సభ్యుడు, డిజిటల్ వార్ఫేర్లో నిపుణుడైన ఆండ్రే జానోనెస్.
ఆండ్రే జానోనెస్ మాస్టర్ ప్లాన్
ఆండ్రే జానోనెస్ గతంలో బస్ ఫేర్ కలెక్టర్‌గా సాధారణ జీవితం గడిపిన వ్యక్తి. అయితే ప్రజలతో ఎలా మాట్లాడాలో, వారిని ఎలా కదిలించాలో ఆయనకు బాగా తెలుసు. లూలాను గెలిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్న ఆయన, వామపక్ష నాయకులు ఎప్పుడూ అనుసరించని ఒక దూకుడు శైలిని ఎంచుకున్నారు. కేవలం సాంప్రదాయ ప్రచారాలకు స్వస్తి పలికి, సోషల్ మీడియాను ఒక రణరంగంగా మార్చేశారు. ఈ వ్యూహంలో భాగంగా ఆయన టెలిగ్రామ్ లేదా ఫేస్బుక్ కాకుండా వాట్సాప్ వేదికగా “లూలాస్ ఆర్మీ” అనే పేరుతో ఒక ప్రత్యేక ఛానెల్‌ను ప్రారంభించారు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఊహించని విధంగా దాదాపు ఒక కోటి ఎనిమిది లక్షల మంది ఫాలోవర్లు ఇందులో చేరారు. ఇది కేవలం ఒక గ్రూప్ కాదు, సోషల్ మీడియాలో లూలా తరఫున పోరాడేందుకు సిద్ధమైన ఒక సైన్యంలా తయారైంది.
సోషల్ మీడియాలో అల్గారిథమ్ షేక్…
ఈ వాట్సాప్ ఛానెల్ పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జానోనెస్ ఎప్పుడూ సైనిక పరిభాషలోనే మాట్లాడుతూ సైనికులు, దళాలు, మిషన్లు అంటూ సభ్యులను ఉత్సాహపరిచేవాడు. ‘ప్రజలారా, అర్జెంటుగా ఇప్పుడే వైరల్ చేయండి!’ అని పిలుపునిస్తూ రెడీమేడ్ మెసేజ్‌లు, వీడియోలు, హ్యాష్‌ట్యాగ్‌లను పంపేవారు. వాటిని సభ్యులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తూ ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ ప్రచారం ఎంత వేగంగా సాగిందంటే, ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయింది. ఎన్నికల ప్రచారంలో లూలా ప్రొఫైల్స్ ఏకంగా 20 కోట్ల ఇంటరాక్షన్లను సాధించగా, ప్రత్యర్థి వర్గానికి కేవలం ఐదు కోట్లు మాత్రమే దక్కాయి. సోషల్ మీడియా అల్గారిథమ్‌ను ఎలా మేల్కొలపాలో తెలిసిన జానోనెస్, సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు రాత్రి చేసిన 24 గంటల లైవ్ స్ట్రీమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ మెసేజ్‌లు ఇంటర్నెట్ను షేక్ చేశాయి.
6.4 కోట్ల ఓట్లతో చారిత్రాత్మక విజయం
ఈ వాట్సాప్ వ్యూహం కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా, లక్షలాది మంది ఓటర్లను నేరుగా పోలింగ్ బూత్‌ల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. రెండవ విడత ఎన్నికల్లో కోట్లాది మంది అదనపు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వీరిలో ఎక్కువ మంది లూలా వైపు మొగ్గు చూపడానికి ఈ డిజిటల్ సమీకరణే ప్రధాన కారణమని విశ్లేషకులు భావించారు. చివరకు ఫలితాలు వెలువడినప్పుడు లూలా 6 కోట్ల 40 లక్షలకు పైగా ఓట్లను సాధించి నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.
ఆధునిక రాజకీయాల్లో కొత్త అధ్యాయం
ఈ మొత్తం ఉదంతం ఆధునిక రాజకీయాల్లో సోషల్ మీడియా ఎలాంటి పెనుమార్పులు సృష్టించగలదో మరోసారి స్పష్టం చేసింది. సంప్రదాయ క్యాంపెయిన్ శైలికి భిన్నంగా, ప్రజల చేతిలో ఉన్న స్మార్ట్ఫోనే అసలైన ఓటింగ్ యంత్రంగా పనిచేసేలా చేయడంలో జానోనెస్ వంద శాతం సఫలమయ్యారు. డిజిటల్ యుగంలో ప్రచారం అంటే కేవలం పోస్టర్లు, కరపత్రాలు కాదని, అది డేటా మరియు మొబిలైజేషన్ గేమ్ అని నిరూపితమైంది. ఆండ్రే జానోనెస్ సాధించిన ఈ విజయం ఒక సరికొత్త రాజకీయ పోరాట పద్ధతికి నాంది. నాయకులు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా వారిని ఒక్కతాటిపైకి తెచ్చి గెలుపు తీరాలకు చేర్చవచ్చని ఇది నిరూపించింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఈ వ్యూహాన్ని అధ్యయనం చేయడం ఖాయం.