- ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ నివేదిక
- ఈ కారణంగానే ఏటా 23 లక్షల కేసులు
- సిగరెట్, లిక్కర్, జెనటికల్ తోడు ఇన్ఫెక్షన్
- హెచ్‌పీవీ హెపటైటిస్‌తో తీవ్ర ముప్పు
- టీకాలు, ముందస్తు పరీక్షలతో నివారణ
సహనం వందే, హైదరాబాద్:
మనం సాధారణంగా క్యాన్సర్ అనగానే సిగరెట్, పొగాకు తాగడం, అధిక బరువు, జంక్ ఫుడ్ లేదా జన్యుపరమైన సమస్యల వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ ఎవరికైనా జలుబు లేదా జ్వరం లాగా చిన్నపాటి ఇన్ఫెక్షన్ కారణంగా క్యాన్సర్ వస్తుందంటే నమ్మడం కష్టమే. అయినా, ఇది అక్షరాలా నిజమని ఒక షాకింగ్ రీసెర్చ్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం కేవలం జీవనశైలి మాత్రమే కాకుండా, సాధారణంగా భావించే వైరస్లు, బాక్టీరియాలు కాలక్రమేణా శరీరంలో ప్రాణాంతక కణితులుగా మారుతున్నాయి. ఈ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 23 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు కేవలం ఇన్ఫెక్షన్ల వల్లనే నమోదయ్యాయి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 12 శాతంగా ఉంది.
క్యాన్సర్ కారకమైన ప్రధాన ఇన్ఫెక్షన్లు
అసలు ఏయే ఇన్ఫెక్షన్లు ఈ క్యాన్సర్లకు కారణం అవుతున్నాయనేది చూస్తే, కొన్ని రకాల వైరస్‌లతో పాటు ఒక నిర్దిష్టమైన బాక్టీరియం కూడా ఈ ముప్పును కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తే, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్‌పీవీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతోంది. అలాగే హెలికోబాక్టర్ పైలోరి అనే బాక్టీరియం కడుపులో ఇన్ఫెక్షన్లను సృష్టించి దీర్ఘకాలంలో కణతులు ఏర్పడేలా చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనలాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాలలోనే ఈ సమస్య అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. మన లాంటి దేశాల్లో జనాభా ఎక్కువ ఉండటం, అవగాహన లోపించడం, సరైన వైద్య సదుపాయాలు అందని కారణంగా ఈ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

టీకాలు ఆధునిక చికిత్సల ప్రాముఖ్యత
ఈ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్లను ముందుగానే అడ్డుకునే అద్భుతమైన మార్గాలలో వ్యాక్సిన్ల ప్రాముఖ్యత ఎంతో ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఉదాహరణకు హెచ్‌పీవీ నిరోధించే వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి అవకాశం ఉంది. అయితే క్యాన్సర్ కారకమైన ప్రతి వైరస్‌కు లేదా బాక్టీరియానికి నేరుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ హెపటైటిస్ సి కి టీకా లేదు, కానీ దానిని నయం చేయడానికి ఆధునిక మందులు వచ్చాయి. అలాగే బాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించి యాంటీబాయోటిక్స్ ద్వారా చికిత్స చేస్తే అవి క్యాన్సర్‌గా మారకుండా ముందే అడ్డుకోవచ్చు.
ముందస్తు పరీక్షలే రక్షణ కవచం
వ్యాక్సిన్లు అందుబాటులో లేని ఇన్ఫెక్షన్ల విషయంలో ముందస్తు పరీక్షలు మన ప్రాణాలను కాపాడే కవచంలా పనిచేస్తాయి. ఉదాహరణకు మహిళల్లో క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారంలో వచ్చే మార్పులను ప్రాథమిక దశలోనే పసిగట్టవచ్చు. అలాగే కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్లను ఎండోస్కోపీ లేదా ఇతర సాధారణ పరీక్షల ద్వారా గుర్తించి ప్రారంభ దశలోనే నయం చేసుకోవచ్చు. తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ నివారణా చర్యలు క్షేత్రస్థాయికి సక్రమంగా చేరకపోవడమే అసలు సమస్యగా మారుతోంది. ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు పూర్తిగా చేరకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా ఆసుపత్రులకు రావడం, వ్యాధి ముదిరిపోయి ప్రాణాలను కాపాడటం కష్టమవుతోంది.
ప్రభుత్వాల చర్యలు… ప్రజారోగ్య రక్షణ
ఈ పరిస్థితిని మార్చాలంటే కేవలం వైద్యులు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్య రంగంలో పెద్దఎత్తున నిధులు కేటాయించాలి. పాఠశాల దశ నుంచే పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో లేదా ఉచితంగా ఈ వ్యాక్సిన్లు అందేలా బలమైన విధానాలను అమలు చేయాలి. క్యాన్సర్ అని భయపడకుండా సరైన సమయంలో వేయించుకునే వ్యాక్సిన్లు, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, పరిశుభ్రమైన జీవనశైలితో ఇన్ఫెక్షన్లను, వాటి ద్వారా వచ్చే క్యాన్సర్లను నివారించవచ్చు. ముందస్తు జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని గుర్తుంచుకోవాలి.