విశాఖ గూగుల్‌‌కు గండం – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

Visakha Google Data Centre Vs ?High Court
  • సొంత రిస్క్ మీదే నిర్మించాలని ఆదేశం
  • షరతులతో అనుమతి… సర్కారుకు బిగ్ షాక్
  • అసలు వైజాగ్ ల్యాండ్ డ్రామా ఏంటి?

సహనం వందే, విశాఖపట్నం:

కోట్ల రూపాయలు పెట్టి డేటా సెంటర్ కడితే… రేపు పొద్దున దాన్ని ఊడబీకమంటే ఏం చేస్తారు? వైజాగ్ సముద్ర తీరంలో గూగుల్, అదానీ కలిసి కట్టబోయే భారీ డేటా సెంటర్ కథ ఇప్పుడు సరిగ్గా ఇలాగే తయారైంది. ఒకవైపు భారీ పెట్టుబడులు, మరోవైపు పర్యావరణ ముప్పు అనే పెద్ద ప్రశ్న!

సొంత రిస్క్ మీదే ప్రాజెక్టు నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక షాకింగ్ ట్విస్ట్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ముందుకు సాగించవచ్చని కోర్టు చెప్పినప్పటికీ, ఒక షరతు విధించింది. ఈ నిర్మాణం అంతా డెవలపర్ సొంత రిస్క్ మీదే జరగాలని తేల్చి చెప్పింది. అంటే రేపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఏమైనా వస్తే అయ్యే నష్టానికి కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డోలాయమానంలో పడ్డట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ ముందంజ వేస్తున్నప్పటికీ చట్టపరమైన చిక్కులు మాత్రం వీడలేదు.

పర్యావరణ పరిరక్షణపై పిల్ అసలు
ఈ ప్రాజెక్టుపై వివాదం ఎందుకు మొదలైందంటే… పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పిల్ దాఖలైంది. విశాఖపట్నంలో ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలం పర్యావరణం రీత్యా చాలా సున్నితమైనదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ యూజ్ నిబంధనలను ఉల్లంఘించారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రక్షిత ప్రాంతాలకు, సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పర్యావరణాన్ని బలిపెడతారా?
హైకోర్టు ఈ కేసును సమీక్షిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు అనుమతినివ్వడంపై భిన్నాద్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ముఖ్యమే అయినా మరోవైపు పర్యావరణాన్ని బలిపెట్టడం సరికాదనే వాదన బలంగా వినిపిస్తోంది. నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత పర్యావరణ అనుమతులు లేవని తెలిస్తే ఆ భవనాలను ఏం చేస్తారనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. డెవలపర్లు ఓన్ రిస్క్ మీద పనులు చేసుకోవచ్చని చెప్పడం ద్వారా కోర్టు బంతిని కంపెనీల కోర్టులోనే నెట్టేసింది. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణపై కోర్టు ఎంతటి పట్టుదలతో ఉందో అర్థమవుతోంది.

డేటా సెంటర్లకు అపారమైన విద్యుత్, నీరు
ఈ ప్రాజెక్ట్‌లో గూగుల్ లాంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో పాటు అదానీ గ్రూప్ భాగస్వామిగా ఉండటం వల్ల దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పడింది. డేటా సెంటర్లు అనేవి అపారమైన విద్యుత్, నీటిని వినియోగిస్తాయి. ఇది స్థానిక వనరులపై విపరీతమైన ఒత్తిడి తెస్తుంది. అందుకే పర్యావరణంపై ప్రభావం అంచనా అత్యంత పారదర్శకంగా జరగాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. భూ కేటాయింపుల్లో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై కూడా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వేగంగా పనులు జరిపించడం సముచితం కాదనే భావన వ్యక్తమవుతోంది.

త్రిశంకు స్వర్గంలో ప్రాజెక్ట్ భవితవ్యం
కోర్టు తీర్పు అంతిమంగా పర్యావరణ హక్కుల వైపు మొగ్గు చూపుతుందా లేక పారిశ్రామిక అభివృద్ధి వైపు నిలుస్తుందా అనేది వేచి చూడాలి. సొంత రిస్క్ మీద పనులు చేపట్టడం అంటే కోట్ల రూపాయల ధనంతో జూదం ఆడటమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రాజెక్ట్ భవితవ్యం త్రిశంకు స్వర్గంలోనే ఉన్నట్లు లెక్క. ఒకవేళ ఈ నిర్మాణాలను కోర్టు అక్రమం అని తేల్చితే గూగుల్, అదానీలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఒక పెద్ద పరీక్షగా మారింది. అభివృద్ధి, పెట్టుబడులు ఎంతో అవసరం. కానీ అదే సమయంలో మన భవిష్యత్తును నిలబెట్టే పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తే, ఆ అభివృద్ధి ఎవరి కోసం? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *