- కులాలు కాదు వర్గాలే లెక్కిస్తామన్న కేంద్రం
- బీసీ-ఏ, బీ, సీ, డీ లాంటి గ్రూపులతో లెక్క
- ఎస్సీ, ఎస్టీల మాదిరి కులాల కోడింగ్ చేయరు
- బీసీ కులాల జనాభా బయటికి రాకుండా కుట్ర
సహనం వందే, హైదరాబాద్:
మన దేశంలో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసేటప్పుడు ఏ కులానికి ఆ కులం పేరు పక్కాగా రాస్తారు. కానీ ఓబీసీల విషయానికి వచ్చేసరికి మాత్రం, ‘అవి కులాలు కావు, వర్గాలు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కొర్రీ పెడుతోంది. అసలు ఇక్కడ వర్గం అంటే ఏంటి? మనం రాష్ట్రాల్లో చూసే బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ లాంటి గ్రూపులేనా? లేక ఈ వర్గం అనే పదం వెనక ఓబీసీల జనాభాను దాచేసే పెద్ద కుట్ర ఏదైనా ఉందా?
కులాల పేర్లు గల్లంతు…
రాబోయే 2027 జనగణనలో కులాల లెక్కింపుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూస్తుంటేనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కించేటప్పుడు అధికారులు ఒక స్పష్టమైన పద్ధతిని ఫాలో అవుతారు. ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఏ కులం పేరు ఉందో, ఆ కులానికి నిర్దిష్టమైన కుల పేరును ప్రత్యేక కోడ్ నంబర్లతో సహా నమోదు చేస్తారు. ఉదాహరణకు… మాల, మాదిగ లేదా గిరిజన ఉప కులాలు ఏవైనా సరే, సర్టిఫికెట్లలో ఎలా ఉంటాయో జనాభా లెక్కల్లో కూడా అలాగే పక్కాగా రికార్డు అవుతాయి. కానీ ఓబీసీల విషయానికి వచ్చేసరికి మాత్రం కేంద్రం ఒక విచిత్రమైన, ఎవరికీ అంతుచిక్కని వాదనను ముందుకు తెస్తోంది.

వర్గం అంటే ఏంటి?
ఇంతకీ కేంద్రం చెబుతున్న వర్గం లేదా క్లాస్ అంటే ఏమిటి? మన రాష్ట్రాల్లో బీసీలను లేదా వెనుకబడిన తరగతులను ఏ విధంగా అయితే బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ లాంటి గ్రూపులుగా విభజిస్తారో, కేంద్రం ఈ వర్గాలనే ఉద్దేశిస్తోంది. అంటే ఒకే కేటగిరీ కింద పదుల సంఖ్యలో వేర్వేరు కులాలను కలిపి ఒక గ్రూప్‌గా తయారు చేస్తారు. ఉదాహరణకు, బీసీ-ఏ కింద కొన్ని డజన్ల చిన్న కులాలు ఉంటాయి, బీసీ-బీ కింద వేరే కులాలు ఉంటాయి. ఈ ఏ, బీ, సీ, డీ లాంటి పెద్ద గ్రూపులను మాత్రమే చూస్తాం తప్ప, ఆయా గ్రూపుల్లో ఉన్న విడివిడి కులాల పేర్లను లెక్కించలేం అని కేంద్రం వాదిస్తోంది.
బీసీ జనాభా బయటికి రాకుండా కుట్ర…
ఎస్సీ, ఎస్టీలకు ఒక పద్ధతి, బీసీలకు మరొక పద్ధతి పెట్టడం వెనక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీసీ జాబితాలలో కులాల పేర్ల విషయంలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఎస్సీ, ఎస్టీ జాబితాలను ఎలాగైతే ఎప్పటికప్పుడు సవరించి సరిగ్గా అమలు చేస్తున్నారో అలాగే బీసీ జాబితాలను కూడా నిపుణుల కమిటీల చేత సరిచేయవచ్చు. కానీ ఆ జాబితాలను మొత్తంగా పక్కన పడేసి, ఓపెన్ కాలమ్ పద్ధతిని తెచ్చి ఎవరికి వారు ఇష్టమొచ్చిన పేర్లు రాసుకునేలా వదిలేయడం అంటే అసలు బీసీల కచ్చితమైన జనాభా బయటికి రాకుండా కుట్ర చేయడమే అవుతుంది.
సర్టిఫికెట్లలో రాస్తున్నప్పుడు సమస్యేంటి?
సాధారణ సమయాల్లో ప్రభుత్వ రికార్డులు, కుల ధృవీకరణ పత్రాలు ప్రతీ ఒక్కరినీ వారి నిర్దిష్టమైన కులం గుర్తింపుతోనే స్పష్టంగా ఉంటాయి. బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు వారి నిర్దిష్టమైన కులం పేరును, అలాగే అది ఏ గ్రూప్ కింద వస్తుందో స్పష్టంగా రాస్తారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నిర్దేశిత కులం ప్రాతిపదికన గుర్తిస్తున్నారు. మరి అలాంటప్పుడు జనాభా లెక్కల్లో మాత్రం ఈ రెండు వేరని చెప్పడం పచ్చి మోసం కాక మరేంటి? బీసీ సంఘాలు లేవనెత్తుతున్న ఈ న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందా లేక పాత సాకులతోనే కాలం గడుపుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ దేశంలో కులగణన అంశంపై జరుగుతున్న ఈ వర్గాల గోల్‌మాల్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.