గాంధీయిజం జిందాబాద్ – కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే పిలుపు

CJP Abhijit Gandhiism Slogans
  • మహాత్ముడి మార్గమే భారతదేశానికి దిక్సూచి
  • విదేశీ హింస, విప్లవాలు మనకొద్దని స్పష్ఠీకరణ
  • భారత రాజ్యాంగమే ఆయుధమని వెల్లడి
  • నేపాల్, బంగ్లాదేశ్ ఆదర్శం కాదని ఉద్ఘాటన

సహనం వందే, న్యూఢిల్లీ:

న్యూఢిల్లీ కేంద్రంగా రగులుతున్న విద్యార్థి ఉద్యమంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ తరహా హింసాత్మక లేదా తీవ్రవాద పోరాటాలను మన దేశానికి వర్తింపజేయకూడదని ఆయన స్పష్టం చేశారు. భారత విద్యార్థి లోకం కేవలం మహాత్మా గాంధీ చూపించిన శాంతియుత అహింసా మార్గంలోనే తమ హక్కుల సాధనకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆందోళనలను మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ, విద్యార్థులు రాజ్యాంగానికి లోబడే తమ పోరాటం సాగిస్తున్నారని ఆయన ప్రకటించారు.

విదేశీ ఉద్యమాల ముసుగులో విమర్శలు…
ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనలను బంగ్లాదేశ్ లేదా నేపాల్‌లలో తలెత్తిన రాజకీయ సంక్షోభాలతో పోల్చడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. మన దేశంలోని విద్యార్థుల ఆందోళనను చెడుగా చిత్రీకరించేందుకు, ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలపై బురద చల్లేందుకే ఇటువంటి పోలికలు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల నుంచి తీవ్రస్థాయిలో ఆటంకాలు, హద్దులు దాటిన చర్యలు ఎదురైనప్పటికీ నిరసనకారులు ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని గుర్తుచేశారు. భారత్ ఒక బలమైన రాజ్యాంగ వ్యవస్థ కలిగిన దేశమని, ఇక్కడ అహింసాత్మక మార్గంలోనే పాలకుల విధానాలను ప్రశ్నించగలమని ఆయన పేర్కొన్నారు.

నీట్ బాధితులకు పరిహారానికి డిమాండ్
ప్రవేశ పరీక్షల ప్రక్రియలో జరిగిన లోపాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందకపోవడంపై దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని, కానీ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని నిలదీశారు. విద్యార్థుల మరణాలకు కారణమైన లోపాలను దిద్దుకోకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. బాధితుల కుటుంబాలకు తగిన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పుల ఆవశ్యకత
దేశంలో నీట్ వంటి కీలక పోటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరగడం వల్ల కోట్లాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరగడం, విద్యావ్యవస్థపై పాలకులకు నిర్లక్ష్యం పెరిగిపోవడం యువతను మానసిక వేదనకు గురిచేస్తోందన్నారు. వెంటనే నియామక సంస్కరణలు చేపట్టాలని, విద్యా రంగానికి ఇచ్చే ప్రాధాన్యతను, బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

CJP Abhijeet Deekshe Gandhism Slogans

.

శాంతియుత ఉద్యమాలపై అణచివేత ధోరణి
పోలీసు యంత్రాంగం, రాజ్యవ్యవస్థ శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై కఠినంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టప్రకారం శాంతియుతంగా ఆందోళనలు చేపట్టే హక్కు ప్రతీ పౌరుడికి ఉందని, అయితే విద్యార్థుల నిరసనలను నిర్బంధాలతో ఆపాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమేనని విమర్శించారు. ప్రభుత్వం తన అణచివేత చర్యలను పక్కనబెట్టి, విద్యార్థులు లేవనెత్తుతున్న అసలైన సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

గాంధేయ మార్గమే భారతదేశానికి దిక్సూచి
రాజకీయ స్వేచ్ఛ, హక్కుల సాధనకు హింస ఏమాత్రం పరిష్కారం కాదని… మహాత్మాగాంధీ చూపిన బాటలోనే భారత ప్రజాస్వామ్యం నిలబడి ఉందని దీప్కే ఉద్ఘాటించారు. దేశ యువత విదేశీ పోకడలకు లోనుకాకుండా మన రాజ్యాంగ విలువలకు కట్టుబడి తమ ఆందోళనలను కొనసాగించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిధిలోనే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని, విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఇదే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ముగింపు లేని పోరాటం…
బాధిత విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వహిస్తే దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని దీప్కే హెచ్చరించారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటం, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం, నియామకాలలో పారదర్శకత తీసుకురావడంపై పాలకులకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *