బర్గర్లు అమ్మితే కేసు బుక్ – స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్ నిషేధం

No Junk Food Near Schools - Maharashtra Government
  • మహారాష్ట్ర సర్కారు మహా నిర్ణయం
  • తీవ్రమవుతున్న అనారోగ్య ముప్పుకు చెక్
  • బలవర్ధక భోజనమే బడిలో ముఖ్యం

సహనం వందే, మహారాష్ట్ర:

పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జంక్ ఫుడ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బుధ వారం నాడు ఆహార, ఔషధ నియంత్రణ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. బడుల చుట్టూ ఉన్న ప్రమాదకరమైన ఆహార పదార్థాల విక్రయాలను పూర్తిగా అడ్డుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిన్ననాడే పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడటమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం.

బలవర్ధక భోజనమే బడిలో ముఖ్యం
మహారాష్ట్రలో పాఠశాలల చుట్టూ 50 మీటర్ల పరిధిలో అన్ని రకాల జంక్ ఫుడ్ అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రకటనలు ఇవ్వడం, ఉచితంగా పంపిణీ చేయడం కూడా నేరంగా పరిగణిస్తారు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే ప్యాకెట్ చిప్స్, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఇన్‌స్టాంట్ స్నాక్స్ వంటి వాటిని ఎక్కడా విక్రయించడానికి వీల్లేదు. పిల్లల ఆరోగ్య భద్రతను కాపాడటానికి ఆహార, ఔషధ నియంత్రణ శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది. బడుల చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు లక్ష్యం.

No Junk Foods Near Schools - Maharashtra Government

పాఠశాలల క్యాంటీన్లపై కఠిన నిబంధనలు
ప్రతి పాఠశాల క్యాంటీన్ తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. క్యాంటీన్లలో ప్యాకెట్ ఆహారాలకు బదులుగా తాజా పండ్లు, పాలు, మజ్జిగ, మొలకెత్తిన గింజలు, సంప్రదాయ భారతీయ చిరుతిండ్లను మాత్రమే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను క్యాంటీన్ల లోపల కూడా పూర్తిగా నిషేధించాలని పాఠశాల యాజమాన్యాలకు తేల్చిచెప్పారు.

ఆరోగ్య స్పృహ పెంచేందుకు శిక్షణ
పాఠశాలల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులలో కూడా పోషకాహారంపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ఆహార భద్రతా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాఠశాలల లోపల, చుట్టుపక్కల ప్రాంతాలలో విక్రయించే ఆహార పదార్థాలపై నిఘా మరింత కఠినతరం చేస్తారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

తనిఖీలు… కఠిన శిక్షలు
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. పాఠశాలలు, క్యాంటీన్లు, సమీపంలోని దుకాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసేలా అధికారులు చర్యలు చేపడతారు. పాఠశాలల సమీపంలో పొగాకు, ఇతర నిషేధిత ఉత్పత్తుల అమ్మకాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపుతారు.

భవిష్యత్ తరాల కోసం…
పిల్లలకు ప్యాకెట్ ఆహారాలు మరియు పానీయాలపై నిఘాను మరింత కఠినతరం చేశారు. ఆహార కల్తీ, తప్పుదారి పట్టించే లేబుల్స్, అసురక్షిత ఆహార ఉత్పత్తులపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ సమగ్రమైన ప్రచారంలో భాగంగానే తాజాగా ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో సమాజంలో మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *