కంగనా రనౌత్ X రాఖీ సావంత్ – సెలెబ్రిటీల మధ్య నిప్పు రాజేసిన నీట్ రచ్చ

Kangana Raunath Vs Rakhi Sawanth
  • కంగనాపై ఇన్‌స్టాలో ఒక ఫైర్ వీడియో రిలీజ్
  • చుడైల్, గట్టర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు
  • అసలు ఎంపీ ఎలా అయ్యావంటూ విమర్శలు
  • సోషల్ మీడియాలో మాటల యుద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ నిరసనల అంశం ఇప్పుడు సినిమా తారల మధ్య పచ్చి బూతుల వార్ గా మారింది. పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన సెలబ్రిటీ లీడర్ కంగనా రనౌత్ యువతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మరో కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ నేరుగా రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మొదలైన ఈ మాటల యుద్ధం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఒకే ఒక్క మంటను రగిలిస్తోంది.

నీట్ నిరసనలు… జెన్ జీ రగడ
నీట్ పేపర్ లీక్ ఆందోళనలు, విద్యార్థి సంఘాల నిరసనలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న యువతను ముఖ్యంగా జెన్ జీ తరాన్ని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. నిరసనల్లో పాల్గొంటున్న మహిళలను, విద్యార్థులను జెన్ గట్టర్ అంటూ, వారిని చూస్తేనే వాంతులు వచ్చేలా ఉన్నాయంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయిపోయి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలను రగిలించాయి.

Kangana Vas Rakhi Sawanth

రాఖీ సావంత్ సంచలన ఎంట్రీ
కంగనా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచం నుండి ఎవరూ ఊహించని విధంగా మరో కాంట్రవర్సీ క్వీన్ రంగంలోకి దిగింది. ఆమె ఎవరో కాదు రాఖీ సావంత్. కంగనా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాఖీ సావంత్ నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫైర్ వీడియోను రిలీజ్ చేసింది. దేశంలోని యువతను, ఆడబిడ్డలను కించపరిచేలా పార్లమెంట్ సభ్యురాలైన ఒక మహిళ మాట్లాడటం ఏంటని రాఖీ నిలదీసింది. కంగనాను ఏకంగా చుడైల్ అంటూ, ఆమె నోరు గట్టర్ లాంటిదంటూ ఎప్పట్లాగే తనదైన శైలిలో విరుచుకుపడింది.

రాజకీయ ప్రయాణంపై తీవ్ర ప్రశ్నలు
ఈ వీడియోలో రాఖీ సావంత్ కేవలం తిట్లతో సరిపెట్టకుండా కంగనా రాజకీయ ప్రయాణంపై అత్యంత ఘాటైన ప్రశ్నలు లేవనెత్తింది. అసలు నువ్వు ఎంపీ ఎలా అయ్యావు? నువ్వు గనుక నిజంగా ప్రజల్లోకి వచ్చి పోటీ చేస్తే నీకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవంటూ రాఖీ సవాలు విసిరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో అసలు నువ్వు ఎలా గెలిచావో, నీకు అంత పేరు ఎలా వచ్చిందో నాకైతే అంతుచిక్కడం లేదంటూ తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి యువతను అవమానించడం నీ దిగజారిన మనస్తత్వానికి నిదర్శనమని మండిపడింది.

రైతుల ఆందోళనల నుంచి నేటి పోరు వరకు
గతంలోనూ పలుమార్లు కంగనా రనౌత్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. రైతుల ఆందోళనల సమయం నుంచి మొదలుకొని తాజా నీట్ నిరసనల వరకు ఆమె వాడే భాషపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఆమె నేరుగా జెన్ జీ తరాన్ని, విద్యార్థినులను టార్గెట్ చేయడం వల్ల వివాదం సెలబ్రిటీల మధ్య రచ్చగా మారింది. రాజకీయ నాయకురాలిగా మారిన తర్వాత కూడా కంగనా తన పాత శైలిని మార్చుకోలేదని, తోటి నటులు, ప్రజల నుంచే ఆమెకు ఇలాంటి ఘాటైన రియాక్షన్లు రావడం గమనార్హం. సోషల్ మీడియాలో కంగనా మద్దతుదారులు, రాఖీ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *