- ఆకలిని చంపేసే వాసన మాయాజాలం
- డార్క్ చాక్లెట్ తోనే మరింత ప్రయోజనం
సహనం వందే, హైదరాబాద్:
జిమ్ కు వెళ్ళే కండల వీరులారా ఇకపై బరువులెత్తే ముందు ఒక ముక్క చాక్లెట్ తినాల్సిన పనిలేదు. కేవలం దాని వాసన చూస్తే చాలు మీ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అలసట తెలియకుండా కండరాలు ఉక్కులా తయారవుతాయి. శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ రంగంలో ఇదొక కొత్త సంచలనం.
పరిశోధనలో అద్భుత ఫలితాలు
మలేషియాలోని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై లోతైన అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 23 ఏళ్ళ వయసున్న 23 మంది యువకులను ఎంపిక చేశారు. వారు 10 గంటల పాటు ఉపవాసం ఉన్న తర్వాతే వ్యాయామాలు చేశారు. బరువులు ఎత్తే సమయంలో చాక్లెట్ వాసన పీల్చడం వల్ల ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి.
డార్క్ చాక్లెట్ తోనే మ్యాజిక్
వ్యాయామం చేస్తున్న సమయంలో 90 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ వాసన చూసిన వారిలో అద్భుతమైన మార్పు కనిపించింది. వారు ఎటువంటి అదనపు ఫోర్స్ లేకుండానే 18 లెగ్ ఎక్స్టెన్షన్లు ఎక్కువగా చేయగలిగారు. 60 శాతం కోకో ఉన్న మిల్క్ చాక్లెట్ వాసన చూసిన వారు 9 రెప్స్ అదనంగా చేశారు. కాబట్టి వాసన ఎంతో శక్తివంతమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
పనితీరులో పెరగని అలసట
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇన్ని ఎక్కువ రెప్స్ చేస్తున్నా క్రీడాకారులకు అలసట అనిపించలేదు. తమ సామర్థ్యం పెరిగినట్లు వారు భావించలేదు. ఇదే విషయాన్ని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మహమ్మద్ బిన్ నహారుద్దీన్ ధృవీకరించారు. క్రీడాకారులు కష్టపడకుండానే ఎక్కువ పని పూర్తి చేయడం ఒక అద్భుతమైన సైకోబయోలాజికల్ మార్పు అని ఆయన వివరించారు.
ఆకలిపై ప్రభావం
జిమ్ చేస్తున్నప్పుడు కడుపులో ఆకలి వేయడం సహజం. అయితే వాసన పీల్చడం వల్ల ఆకలి తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. వ్యాయామానికి ముందు ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కానీ మిల్క్ చాక్లెట్ కు ఈ శక్తి లేదు. మిల్క్ చాక్లెట్ వాసన బాగున్నప్పటికీ అది ఆకలిని తగ్గించడంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని అధ్యయనం తేల్చింది.
మనోవిజ్ఞానపరమైన కారణం
ఈ మార్పు వెనుక ఉన్న రహస్యం కేవలం వాసన మాత్రమే కాదు. మనిషికి నచ్చిన లేదా ఇష్టమైన వాసన పీల్చినప్పుడు మెదడులో సానుకూల స్పందన వస్తుంది. ఆ వాసనపై ఆకర్షణతో మనోవిజ్ఞానపరమైన మార్పు చోటు చేసుకుంటుంది. దీనివల్ల కండరాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. వ్యాయామం మధ్యలో 30 సెకన్ల పాటు ఈ వాసన పీల్చడం చాలా ముఖ్యం.
మరిన్ని వాసనలపై పరిశోధనలు
మాత్రమే కాదు ఇతర ఆహార పదార్థాల వాసనలు కూడా ఇలాంటి ఫలితాలను ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే అది మనకు తెలిసిన వాసన అయి ఉండాలి. కనీసం ఆ వాసన పట్ల మనకు అసహ్యం ఉండకూడదు. ఈ ప్రాథమిక సూత్రం ఉంటేనే వర్కవుట్ లో ఆశించిన ఫలితాలు వస్తాయని నహారుద్దీన్ స్పష్టం చేశారు. క్రీడల్లో రాణించే వారికి ఇది కొత్త ఊపిరిని ఇస్తుంది.
