సైన్స్ వైపు సంపన్నుల పరుగు – మత విశ్వాసాలు దాటి విజ్ఞాన శాస్త్ర బాట

Religious Beliefs Vs Science, సైన్స్
  • సైన్స్, శాస్త్ర పరిశోధనలకు వేల కోట్ల విరాళాలు
  • హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీల వలె దానాలు
  • మారుతున్న భారత దేశపు దాతృత్వ ధోరణి

సహనం వందే, హైదరాబాద్:

దశాబ్దాలుగా భారతదేశంలో దానాలు అంటే దేవాలయాలు, మత సంస్థలకే ప్రాధాన్యత ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని దేవుడి నుంచి సైన్స్ ప్రయోగశాలల వైపు మళ్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశాభివృద్ధికి సరికొత్త శాస్త్రీయ పునాదులు వేస్తున్నారు.

సరికొత్త శాస్త్రీయ విప్లవం
కృత్రిమ మేథ, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక ఆవిష్కరణల్లో భారత్ వెనుకబడుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వోల్ఫ్ ప్రైజ్ విజేత జైనేంద్ర జైన్‌కు భారత రియల్ ఎస్టేట్ దిగ్గజం లోథా గ్రూప్ అధినేత అభిషేక్ లోథా ఫోన్ చేయడం దేశంలో చర్చకు దారితీసింది. ఆకాశహర్మ్యాలను నిర్మించే లోథా… క్వాంటం ఫిజిక్స్ పరిశోధనల కోసం ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికా వంటి దేశాల్లో ఇది సాధారణమే అయినా… భారత్‌లో ఇదొక కొత్త ఒరవడి. కేవలం భవనాలే కాదు, భావితరాలకు అవసరమైన మేధో సంపత్తిని నిర్మించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

దాతృత్వంలో పెరిగిన స్పష్టత
రాజీవ్ బజాజ్ వంటి వారు కోర్ ఇంజనీరింగ్ రంగంలో మహిళలకు భారీ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు. మహిళా స్కాలర్లకు గరిష్ఠంగా 8 లక్షల రూపాయల వరకు సాయం అందిస్తున్నారు. క్రిస్ గోపాలకృష్ణన్ మెదడుపై పరిశోధనలకు నిధులు కేటాయిస్తున్నారు. కిరణ్ మజుందార్ షా 2002లో అత్యాధునిక లేబొరేటరీని స్థాపించి బయో సైన్సెస్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన అరడజను మంది టెక్ దిగ్గజాలు రోబోటిక్ ఆస్ట్రానమీ నుంచి వైద్య పరిశోధనల వరకు తమ విరాళాలను మళ్లిస్తున్నారు.

ప్రభుత్వంపైనే భారం వద్దు
హార్వర్డ్, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ లాంటి ప్రపంచ స్థాయి ప్రముఖ విద్యా సంస్థలు దాతలు ఇచ్చే విరాళాలతో ఎదిగాయి. భారత్‌లో ఇప్పటి వరకు ఇది ప్రభుత్వం బాధ్యత అనే విధానం ఉంది. అయితే భారత జీడీపీలో రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం జరుగుతున్న ఖర్చు 0.6 నుంచి 0.7 శాతం మాత్రమే. ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. భారత్‌లో ఇప్పటి వరకు విద్యా సంస్థలను ప్రభుత్వం మాత్రమే నడపాలని భావించడం వల్లే మనం వెనుకబడ్డామని ఆమె విశ్లేషిస్తున్నారు. ఈ ధోరణిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పారిశ్రామికవేత్తలు గట్టిగా చెబుతున్నారు.

నిధుల వెల్లువకు సన్నాహాలు
లోథా గ్రూప్ తన థియరిటికల్ ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ కోసం 955 కోట్ల రూపాయలను కేటాయించింది. పరిశోధనలు, వాణిజ్యం, సాంకేతికత ఒకే వేదికపైకి వస్తేనే దేశం గొప్పగా మారుతుందని అభిషేక్ లోథా నమ్మకం. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి సంపన్న కుటుంబాలు 1.43 లక్షల కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నిధులు శాస్త్రీయ సంస్థల నిర్మాణానికి, దీర్ఘకాలిక పరిశోధనలకు ప్రాణం పోస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.

సైన్స్ పరిశ్రమలకు అవసరమైన మేధస్సు


భారత్‌లో పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న అంతరం పరిశోధనల అభివృద్ధిని దెబ్బతీస్తోంది. యూనివర్సిటీల్లో బోధించే అంశాలకు, మార్కెట్ అవసరాలకు పొంతన లేకపోవడం ప్రధాన సమస్య. ఫార్మా రంగంలో కొత్త ఔషధాల ఆవిష్కరణకు భారీగా నిధులు అవసరమని, అందుకు కంపెనీలే ముందుకు రావాలని మజుందార్ షా పిలుపునిచ్చారు. పరిశోధన లేనిదే ఏ కంపెనీ లేదా దేశం కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందలేదని వారు గుర్తు చేస్తున్నారు.

కొత్త తరం దాతృత్వ ధోరణి
సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారు, మొదటిసారి సంపద సృష్టించిన తరం ఇప్పుడు సైన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దస్రా సహ వ్యవస్థాపకురాలు నీరా నంది మాటల్లో చెప్పాలంటే, ఈ కొత్త తరం ఫలితాల మీద, డేటా ఆధారిత పెట్టుబడుల మీద దృష్టి పెడుతోంది. ఇది భారత అభివృద్ధిలో ఒక చారిత్రక ఘట్టం. విద్య, ఆరోగ్య రంగాలు ఎలాగూ ముఖ్యమే అయినా, భవిష్యత్తు కోసం సైన్స్ రంగానికి ఇచ్చే విరాళాలు దేశ భవితను మారుస్తాయనడంలో సందేహం లేదు.

Religious Beliefs Vs Science, సైన్స్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *