మేకప్పు మహాగబ్బు – ముఖానికి మలమూత్ర క్రీమ్

Online Fake Face Makeup Creams
  • ఆన్‌లైన్ మేకప్‌కిట్లలో మానవ విసర్జితాలు
  • బరితెగించి అమ్ముతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు
  • పర్ఫ్యూమ్ రంగు కోసం యూరిన్ వాడకం
  • ప్రాణాంతక బ్యాక్టీరియాతో బ్యూటీ దందా
  • కంపు కొడుతున్న ఇ-కామర్స్ దందా
  • యువత ఆరోగ్యంపై విషపు ముసుగు
  • ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం సంచలనం

సహనం వందే, హైదరాబాద్:

మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్‌లైన్‌ లో తక్కువ ధరకు దొరికే బ్రాండెడ్ మేకప్ సామాగ్రిలో మానవ విసర్జితాలు, మూత్రం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు.. యువత ప్రాణాలను విషపూరిత రసాయనాలకు తాకట్టు పెడుతున్నాయి. అందం కోసం చేసే ఆరాటం కాస్తా ఆసుపత్రి పాలయ్యేలా చేస్తున్న ఈ నకిలీ మాఫియా వెనుక ఉన్న భయంకరమైన కోణాన్ని ల్యాబ్ పరీక్షలు బట్టబయలు చేశాయి.

Fake Cosmetics online

అశుద్ధంతో నిండిన అందం
లాస్ ఏంజిల్స్ పోలీసులు నిర్వహించిన ఒక దాడిలో 6 కోట్ల రూపాయల విలువైన నకిలీ కైలీ కాస్మెటిక్స్, మ్యాక్, నార్స్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షించిన నిపుణులు అందులో బ్యాక్టీరియాతో పాటు మానవ వ్యర్థాలు (హ్యూమన్ వేస్ట్) ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు ధృవీకరించారు. పెర్ఫ్యూమ్ సీసాల్లోని ద్రవానికి బంగారు రంగు రావడం కోసం మూత్రాన్ని వాడుతున్నారనే వార్త వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. యువత తమ ముఖంపై నేరుగా మానవ విసర్జితాలను పూసుకుంటున్నారనే చేదు నిజం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

ల్యాబ్ పరీక్షల్లో తేలిన మోసం
వైర్‌కట్టర్ మీడియా ప్రతినిధి రోజ్ మౌరా లోర్రే అమెజాన్, ఈబే వంటి సైట్ల నుంచి కొన్న 12 ఉత్పత్తులను రేచెల్ జాన్సన్ అనే కెమిస్ట్ పరీక్షించారు. రోడ్ పెప్టైడ్ లిప్ ట్రీట్‌మెంట్ అనే లిప్ గ్లాస్ అసలు దానికి 20 శాతం పూర్తి భిన్నంగా ఉంది. ఆ ట్యూబ్ ఉబ్బిపోయి ఉండటం అందులో ప్రమాదకర సూక్ష్మజీవుల పెరుగుదలను సూచిస్తోంది. నార్స్ కన్సీలర్ అయితే అసలు ప్రొడక్టుకు కేవలం 2 శాతం మాత్రమే మ్యాచ్ అయింది. అంటే మిగిలిన 98 శాతం కేవలం మురికి రసాయనాలే. అందం కోసం కొన్న వస్తువు ఇప్పుడు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తుంది.

Online Face Creams mixed with Urine

కంపెనీల బాధ్యతారాహిత్యం
అమెజాన్ విక్రయాల్లో 60 శాతం, వాల్‌మార్ట్‌లో 95 శాతం థర్డ్ పార్టీ సెల్లర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈబే, షీన్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై నిఘా లేకపోవడంతో నకిలీ తయారీదారులు స్వైరవిహారం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వ నివేదిక ప్రకారం ఆన్‌లైన్‌లో కొన్న కాస్మెటిక్స్ అన్నీ నకిలీవని తేలింది. బాబ్ బార్చీసి అనే నిపుణుడు చెబుతున్నట్లుగా ఈ వస్తువుల వల్ల ప్రజలు తీవ్రమైన దద్దుర్లు, గడ్డలతో ఆసుపత్రి పాలవుతున్నారు. లాభాల వేటలో పడ్డ కంపెనీలు వినియోగదారుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశాయి.

రసాయన విషపు ముసుగు
నకిలీ టూత్‌పేస్టులలో తీపి కోసం యాంటీ ఫ్రీజ్ (కార్ల ఇంజన్లలో వాడేది) కలుపుతున్నారు. డ్రంక్ ఎలిఫెంట్ ప్రొటీని క్రీమ్ 83 శాతం మ్యాచ్ అయినా దాని రంగు పసుపుగా మారి కుళ్ళిపోయినట్లు ఉంది. చార్లెట్ టిల్బరీ సెట్టింగ్ స్ప్రేలు కేవలం 21 శాతం నుండి 25 శాతం మాత్రమే అసలు ప్రొడక్టుకు దగ్గరగా ఉన్నాయి. అంటే 75 శాతం పైగా ఏ రసాయనాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. జాక్ రోజర్స్ అనే నిపుణుడు హెచ్చరించినట్లుగా ఈ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాటి తయారీలో ఏ మురికిని వాడుతున్నారో కనీస పారదర్శకత లేదు.

రికార్డు స్థాయిలో నకిలీల సరఫరా
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా సరిహద్దుల్లో 5 లక్షల నకిలీ పర్సనల్ కేర్ వస్తువులను పట్టుకున్నారు. కానీ పట్టుబడనివి 2 కోట్లకు పైగా వస్తువులు ఉండవచ్చని అంచనా. అంటే లక్షలాది మంది యువత తెలియకుండానే ఈ వ్యర్థాలను వాడుతున్నారు. ఎలిజబెత్ కేరీ స్మిత్ వంటి డిజైనర్లు వీటి ప్యాకేజింగ్ లోని సూక్ష్మ తేడాలను గమనించారు. కానీ సాధారణ వినియోగదారులు ఆ ప్యాకింగ్ చూసి మోసపోతున్నారు. నకిలీ వస్తువులు కేవలం డబ్బునే కాదు… మన శరీరాన్ని కూడా కుళ్ళిపోయేలా చేస్తున్నాయి.

యువతకు హెచ్చరిక
ఆన్‌లైన్‌లో తక్కువ ధర చూసి మురిసిపోవద్దు. గ్లైకోలిక్ సీరమ్స్ వంటివి కూడా నకిలీవేనని నిపుణులు చెబుతున్నారు. ఆండ్రూ కోనిగ్ వంటి విశ్లేషకుల ప్రకారం 80 శాతం మ్యాచ్ ఉన్నా అవి వాడటం ప్రాణాంతకం. కంపెనీలు విచారణ చేస్తున్నామని చెబుతున్నా… మార్కెట్లోకి విషం మాత్రం ఆగడం లేదు. అందం కోసం చేసే ఈ పోరాటంలో మీరు బలి కాకూడదంటే కేవలం అధికారిక స్టోర్లలోనే కొనుగోలు చేయాలని ఈ నిపుణులు సూచిస్తున్నారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *