- కామాంధుడు ఎప్‌స్టీన్‌తో సంబంధాలతో ఔట్
- 10 దావోస్ సదస్సులకు హాజరైన ఎప్‌స్టీన్
- డబ్బుల వేదికలో దగుల్బాజీల కలయిక
- స్విస్ కొండల్లో కుట్రలు… బయటపడ్డ ఫైళ్లు
- ఇప్పటికే బ్రిటన్ రాకుమారుడి అరెస్టు
- అంతర్జాతీయంగా అనేక పీఠాలకు ఎసరు
సహనం వందే, హైదరాబాద్:
అంతర్జాతీయ వేదికపై కామాంధుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాపాల చిట్టా పెను తుపాను సృష్టిస్తోంది. 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు రావడంతో ప్రపంచ దేశాల హేమాహేమీలు వణికిపోతున్నారు. జనవరి నెల నుంచి మొదలైన ఈ ఫైళ్ల ప్రకంపనలు అగ్రనేతల పదవులకు ఎసరు పెడుతున్నాయి. కేవలం సెక్స్ ట్రాప్, స్నేహం మాత్రమే కాదు అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాల ముసుగులో సాగిన ఈ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

దావోస్ వేదికగా దందా…
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ( దావోస్) చీఫ్ బోర్గ్ బ్రెండే గురువారం తన పదవికి రాజీనామా చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో ఏటా జరిగే సదస్సులకు ఈయనే కీలకం. ఎప్‌స్టీన్ వంటి సెక్స్ కుంభకోణం నేరస్తుడితో సంబంధాలు బయటపడటంతో పదవి ఊడిపోయింది. ఎప్‌స్టీన్‌తో ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల విచారణ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. దావోస్ సదస్సులకు ఎప్‌స్టీన్10 సార్లు హాజరయ్యాడు. తనకున్న ధనబలంతో అక్కడ చక్రం తిప్పాడు. ప్రపంచ కుబేరులను, రాజకీయ ఉద్ధండులను తన వలలో వేసుకోవడానికి ఈ వేదికను వాడుకున్నాడు. అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు, మంత్రులు అనేక మందితో రహస్య భేటీలు జరిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత మే నెలలోనే ఈ సంస్థ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు బ్రెండే రాజీనామాతో సంస్థ పతనం మొదలైంది.
పవర్‌ఫుల్ కుర్చీలకు ఎసరు
నార్వే మాజీ ప్రధాని థోర్బ్ జోర్న్ జగ్‌లాండ్ పై ఫిబ్రవరి 12న తీవ్ర అవినీతి కేసులు నమోదయ్యాయి. ఎప్‌స్టీన్‌తో ఆయన జరిపిన ఈమెయిల్ సంభాషణలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మండేల్సన్ సైతం ఎప్‌స్టీన్‌తో ఉన్న గాఢమైన స్నేహం వల్ల పదవిని కోల్పోయారు. అటు ఫ్రాన్స్ మాజీ మంత్రి జాక్ లాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. స్లోవేకియా జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లాజాక్ అమ్మాయిల విషయంలో జరిపిన చాటింగ్ బయటపడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.
హార్వర్డ్ లో ప్రొఫెసర్ ఔట్
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా మాజీ ఆర్థిక మంత్రి లారీ సమ్మర్స్ తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేశారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరుతో ఉన్న సంబంధాలే దీనికి ప్రధాన కారణం. హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వ్యక్తి ఇలా వివాదాల్లో చిక్కుకుని తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. సమ్మర్స్ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ బోర్డు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇండియాలో ఆయన పర్యటించినప్పుడు ఏఐ సమ్మిట్లో ఆయన ప్రసంగాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
బ్రిటన్ రాజవంశీయుడి అరెస్ట్…
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ అలియాస్ ప్రిన్స్ ఆండ్రూ తన రాజరిక హోదాను పూర్తిగా కోల్పోయారు. ఎప్‌స్టీన్ తో గడిపిన కాలం, ఒక యువతిపై జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయనను విండ్సర్ కోట నుంచి బయటకు పంపేలా చేశాయి. చివరకు ఆయనను అరెస్ట్ చేశారు. అగ్రరాజ్యాల్లోని అత్యున్నత పదవుల్లో ఉన్న వారు కూడా ఈ పాపాల బురదలో కూరుకుపోయారు. రాజకీయ నేతల అనుచరులు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లు సైతం ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయక తప్పడం లేదు.
వ్యాపార దిగ్గజాల పదవులకు ఎసరు
హయత్ హోటల్స్ అధినేత థామస్ జె ప్రిట్జ్కర్ ఈ నెల 16న తన పదవికి రాజీనామా చేశారు. బిలియనీర్ అయిన ప్రిట్జ్కర్ కు ఎప్‌స్టీన్ తో ఉన్న పాత సంబంధాలే ఇందుకు కారణం. దుబాయ్ కి చెందిన పోర్ట్ దిగ్గజం సుల్తాన్ అహ్మద్ బిన్ సులేమ్ పేరు కూడా పార్లమెంట్ సాక్షిగా బయటకు రావడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అటు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు లియోన్ బ్లాక్ ఏకంగా 1400 కోట్లకు పైగా రూపాయలను ఎప్‌స్టీన్ కు చెల్లించినట్లు తేలడంతో పక్కకు తప్పుకున్నారు.

న్యాయ వ్యవస్థపై మచ్చ
గోల్డ్ మన్ సాక్స్ జనరల్ కౌన్సిల్ కాథరిన్ రుయెమ్లర్ ఎప్‌స్టీన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. ఖరీదైన బహుమతులు అందుకున్నందుకు ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. అగ్రశ్రేణి లా సంస్థ పాల్ వెయిస్ చైర్మన్ బ్రాడ్ కార్ప్ కూడా ఎప్‌స్టీన్ కు న్యాయ సలహాలు ఇచ్చినందుకు పదవిని వదులుకున్నారు. ఇప్పటివరకు 1200 మంది బాధితులు బయటకు రావడం ఈ కేసు తీవ్రతను చెబుతోంది. ఈ ఫైళ్లలోని ప్రతి పేరు అగ్రరాజ్యాల నైతిక విలువలను ప్రశ్నిస్తూనే ఉంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్