- 5 లక్షల మందిపై కొలంబియా వర్సిటీ రీసెర్చ్
- ప్రముఖ ‘నేచర్’ జర్నల్లో ప్రచురణ
- నిద్రలో అతి వద్దు… తక్కువ అస్సలు వద్దు
సహనం వందే, హైదరాబాద్:
నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. అది శరీర మరమ్మత్తు ప్రక్రియ. కానీ మనం ఎంతసేపు నిద్రపోతున్నామనే దానిపైనే మన ఆయుష్షు ఆధారపడి ఉందని తాజా పరిశోధన విస్మయపరిచే నిజాలను బయటపెట్టింది. నిద్ర తక్కువైతే సమస్య అని మనందరికీ తెలుసు, కానీ అతిగా నిద్రపోవడం కూడా వేగంగా ముసలితనాన్ని తెచ్చిపెడుతుందని సైన్స్ ఇప్పుడు హెచ్చరిస్తోంది. శరీరంలోని 17 అవయవ వ్యవస్థలను విశ్లేషించిన ఈ అధ్యయనం నిద్రలో ఒక సంపూర్ణ సమయాన్ని ఆవిష్కరించింది.

నిద్రలో ఒక స్వీట్ స్పాట్
కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిద్రకు సంబంధించి ఒక అద్భుతమైన స్వీట్ స్పాట్ గుర్తించారు. ప్రతి రాత్రి 6 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల మధ్య నిద్రపోయే వారిలో వృద్ధాప్య లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిధి దాటినా లేదా తగ్గినా శరీర జీవ గడియారం అస్తవ్యస్తమై ముసలితనం వేగంగా ముంచుకొస్తోంది. నిద్ర లేమి, అతి నిద్ర రెండూ సమానమైన అనర్థాలకు దారితీస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
యూకే బయోబ్యాంకు డేటా విశ్లేషణ
ఈ పరిశోధన ఆషామాషీగా జరిగినది కాదు. యూకే బయోబ్యాంకులో నమోదైన సుమారు 5 లక్షల మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. 37 నుంచి 84 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తుల నిద్ర అలవాట్లు, వారి శరీరంలోని 23 రకాల వృద్ధాప్య సంకేతాలు, 17 అవయవ వ్యవస్థలను పరిశీలించారు. ఈ భారీ సమాచారాన్ని ఉపయోగించి శరీర వయసు ఎంత వేగంగా పెరుగుతుందో శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.
అవయవాలపై తీవ్ర ప్రభావం
మెదడు, గుండె, ఊపిరితిత్తులు, రోగనిరోధక వ్యవస్థ వంటి కీలక అవయవాలపై నిద్ర ప్రభావం స్పష్టంగా ఉందని పరిశోధనలో వెల్లడైంది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. అదే 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే అది అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతంగా మారుతోంది. ఇక్కడ ఒక U ఆకారపు సంబంధం కనిపిస్తోంది. తక్కువ నిద్ర పక్కన, ఎక్కువ నిద్ర కూడా అంతే ప్రమాదకరంగా ఉంది.
జీవసంబంధిత వృద్ధాప్యం
మనం పుట్టినప్పుడు ఉండే వయసు ఒకటైతే… మన శరీర అవయవాలు పనితీరును బట్టి చూపే వయసు మరొకటి. దీన్నే బయలాజికల్ ఏజింగ్ అంటారు. అతి నిద్ర వల్ల ఈ బయలాజికల్ ఏజింగ్ వేగవంతం అవుతోంది. కేవలం అలసట మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే వ్యాధులకు, అకాల మరణాలకు కూడా ఈ నిద్ర పద్ధతులే కారణమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సరైన నిద్ర లేని వారిలో వృద్ధాప్య సంకేతాలు 5 నుంచి 10 ఏళ్లు ముందుగానే కనిపిస్తున్నాయి.
సవాలుగా నిద్ర అలవాట్లు
నిద్ర సమయం అనేది వ్యక్తిగతమని చాలామంది భావిస్తారు. కానీ 1 శాతం మందికి తప్ప మెజారిటీ ప్రజలకు పైన చెప్పిన నిర్ణీత గంటల నిద్ర తప్పనిసరి. ఆధునిక జీవనశైలిలో నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల మన శరీర వ్యవస్థలను మనం తెలియకుండానే నాశనం చేసుకుంటున్నాం. నిద్రను ఒక విలాసంగా కాకుండా ఆరోగ్యానికి అవసరమైన ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది.