చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు

EPF
  • సులభతరమైన పీఎఫ్ విత్‌డ్రా
  • ఆధార్ తో అనుసంధానం
  • ఐదు లక్షల వరకు పరిమితి
  • వాట్సాప్ ద్వారా పీఎఫ్ వివరాలు
  • కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన

సహనం వందే, న్యూఢిల్లీ:

కష్టపడి సంపాదించిన డబ్బును అవసరానికి వాడుకోవాలంటే పీఎఫ్ ఖాతాదారులకు నరకం కనిపించేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, యజమాని సంతకం కోసం ప్రాధేయపడటం వంటి వాటికి ముగింపు వచ్చింది. కేంద్రం తెచ్చిన సరికొత్త డిజిటల్ విప్లవంతో పీఎఫ్ సెటిల్మెంట్ చిటికెలో జరిగిపోనుంది. సామాన్యుడి కష్టార్జితం ఇకపై నిమిషాల్లో చేతికి అందనుంది.

పాత కష్టాలకు స్వస్తి
భారతదేశ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ఒక గొప్ప భరోసా. కానీ అత్యవసర సమయాల్లో డబ్బు తీసుకోవడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతున్నా మన పీఎఫ్ ప్రాసెస్ మాత్రం పాత పద్ధతుల్లోనే నలిగిపోయేది. ఆ లోపాన్ని గుర్తించిన కేంద్రం ఇప్పుడు ఒక భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

యజమాని సంతకం అవసరం లేదు
ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు రావాలంటే కంపెనీ యజమాని అప్రూవల్ తప్పనిసరి. ఆ తర్వాత పీఎఫ్ ఆఫీసులో అప్లికేషన్ పెట్టాలి. డబ్బులు రావడానికి వారం నుండి పది రోజులు పట్టేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఏటీఎం లో డబ్బులు తీసుకున్నంత సులభంగా పీఎఫ్ సెటిల్మెంట్ జరగనుంది.

కీలక నిర్ణయం వెనుక మంత్రి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై యజమాని సంతకం అసలు అవసరం లేదు. ఆధార్, యూపీఐ అనుసంధానంతో ఈ ప్రక్రియ సాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ పూర్తయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్ లోని చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

ఉమాంగ్ యాప్ తో సులభం
ఈ ప్రక్రియ చాలా సులభం. ఫోన్ లోని ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకుని కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేయాలి. ఫోన్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అంతే ఆ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. ఎవరి అనుమతి కోసం వేచి చూడాల్సిన పని లేదు.

ఐదు లక్షల వరకు వెసులుబాటు
ఈ సెటిల్మెంట్ పరిమితిని ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది. అత్యవసర వైద్య ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం ఐదు లక్షల వరకు ఎవరినీ అడగకుండానే సెకన్లలో వాడుకోవచ్చు. ఇది ప్రైవేట్ ఉద్యోగులకు నిజంగా గొప్ప ఊరట. అయితే ఈ సౌలభ్యం ప్రైవేట్ రంగ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ లేదా ఎన్పీఎస్ వంటి ప్రత్యేక విధానాలు ఉంటాయి.

వాట్సాప్ ద్వారా పీఎఫ్ వివరాలు
పీఎఫ్ ఖాతాదారులకు మరింత దగ్గరవ్వాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. వాట్సాప్ ద్వారానే పీఎఫ్ వివరాలు తెలుసుకునే సదుపాయం వేగవంతం అవుతోంది. కేవలం హలో అని మెసేజ్ పెడితే చాలు వివరాలు ఫోన్ లో ఉంటాయి. ఈ మార్పుతో సమయం ఆదా అవుతుంది. మధ్యవర్తుల అవసరం లేదు, కమిషన్ల బాధ ఉండదు. పారదర్శకత పెరుగుతుంది. టెక్నాలజీతో పీఎఫ్ ప్రాసెస్ ను సులభతరం చేస్తూ పౌరుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *