- దయనీయ స్థితిలో ఉస్మానియాలో తుదిశ్వాస
- నయా పైస లేక నడిరోడ్డుపైకి చేరిన బతుకు
- కష్టాల్లో ఆదుకోని చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు తెరపై ఎంతోమందిని నవ్వించిన నటి పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు హాస్యంతో ప్రేక్షకులను అలరించిన నటి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడిపోవడం, ఆపై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కన్నీటి అంతిమ శ్వాస
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో వైద్యులు ఆమె కన్నుమూసినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ విషాద వార్తతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్రంగా కలచిపోయారు. ఆమె మరణంపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ సంతాపం వ్యక్తం చేసిన వారు ఎవరు కూడా ఆదుకోలేకపోవడం విషాదం.
దయనీయమైన తుది రోజులు
పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. శ్యామలతో పాటుగా ఉన్న ఆమె కుమార్తె మాధవి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేస్తోంది. అనారోగ్య భారంతో జీవితం వెళ్లదీస్తున్న తరుణంలో ఆమె పడిన వేదన అంతా ఇంతా కాదు.
రోడ్డున పడిన వృద్ధ నటి
మూడు నెలల క్రితం పావలా శ్యామల, ఆమె కూతురు మాధవిని హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఇద్దరిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఆదేశాల మేరకు వారిని వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో గడిపిన కాలంలో వారు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అనాథాశ్రమం నుంచి ఆసుపత్రికి
ఉస్మానియా ఆసుపత్రిలో ఉండలేమని శ్యామల మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికే తిరిగి వచ్చారు. అక్కడి సిబ్బంది బోరబండ పోలీసులకు సమాచారం అందించగా వారిని నగరంలోని అనాథాశ్రమానికి తరలించారు. గతవారం మళ్లీ పావలా శ్యామల గుండె సంబంధిత కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రభుత్వ ఆసుపత్రులే ఆమెకు ఆశ్రయమిచ్చాయి.
కన్నీటి జీవితం…
ఒకప్పుడు వెండితెరపై కళకళలాడిన నటి చివరికి ఆసుపత్రి మంచంపై, అనాథాశ్రమాల చుట్టూ తిరుగుతూ కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరచగా, సినీ ప్రముఖులు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నటిగా ఎన్నో పాత్రలు వేసిన శ్యామల జీవితం విషాదాంతం కావడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు.