న్యాయం ఖరీదు 83 వేల కోట్లు – శిక్ష తప్పించుకున్న గౌతమ్ అదానీ

Adani CAs Dismissed with 83000 Crs Deal
  • అమెరికాలో అవినీతి కేసు కొట్టివేత
  • న్యాయ వ్యవస్థకు తూట్లు
  • తెరవెనుక చీకటి ఒప్పందాలు
  • కార్పొరేట్ శక్తుల విజయం

సహనం వందే, ఢిల్లీ:

అమెరికా గడ్డపై భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన వేల కోట్ల లంచాలు, మోసాల కేసును ట్రంప్ ప్రభుత్వం కొట్టివేసింది. ఎఫ్‌బీఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తును పూర్తిగా పక్కనపెట్టి బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గారౌఫిస్ చేత ఈ కేసును బలవంతంగా కొట్టివేయించిన వైనం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

అమెరికా కోర్టులో అదానీకి ఊరట…
భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికా న్యాయస్థానంలో జరుగుతున్న ఒక పెద్ద లీగల్ పోరాటానికి తెరపడింది. సోమవారం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ కేసును అధికారికంగా రద్దు చేసింది. 2024 సంవత్సరంలో అదానీ మీద కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మన దేశంలో సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు దక్కించుకోవడం కోసం సుమారు 2220 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని లంచాలుగా ఇచ్చారనేది ఆ ప్రధానమైన ఆరోపణ. దీనిపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అలాగే న్యాయ విభాగం దర్యాప్తు కూడా చేపట్టింది.

రాజకీయ నాటకాలతో కేసు రద్దు
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో అనూహ్యమైన మలుపు తిరిగింది. ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఈ మోసం, లంచం ఆరోపణల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రాసిక్యూటర్లు చేసిన ఈ అభ్యర్థనను ఫెడరల్ జడ్జి నికోలస్ గారౌఫిస్ ఆమోదించడంతో కేసు ముగిసింది. మొదట్లో ఈ కేసుపై తీవ్రంగా విచారణ జరిపిన కోర్టు, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఆరోపణలను అధికారికంగా కొట్టేయాల్సి వచ్చింది.

న్యాయమూర్తి ఆగ్రహం… రహస్య ఒప్పందాలు
ఈ కేసును ఉపసంహరించుకున్న తీరు మాత్రం అమెరికా న్యాయ వ్యవస్థలో తీవ్రమైన చర్చకు దారితీసింది. ట్రంప్ నియమించిన డిప్యూటీ అసోసియేట్ అటార్నీ జనరల్ ట్రెంట్ మెక్కోటర్ వ్యవహరించిన తీరుపై జడ్జి నికోలస్ గారౌఫిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన ఎఫ్‌బీఐ అధికారుల నుంచి గాని, ఎస్ఈసీ ఏజెంట్ల నుంచి గాని ఎటువంటి ఇన్‌పుట్స్ తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం డిఫెన్స్ కౌన్సిల్‌తో కలిసి అత్యంత రహస్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అసాధారణమైన విషయమని జడ్జి బహిరంగంగానే తన అసహనాన్ని ప్రదర్శించారు.

83 వేల కోట్లతో బేరసారాలు…
ఈ కేసు తొలగింపు వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక ఒప్పందాలు జరిగాయనే ఆరోపణలు కూడా అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అదానీ తరఫు న్యాయవాది రాబర్ట్ గియుఫ్రా ఏప్రిల్ నెలలో జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులను కలిశారని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ క్రిమినల్ కేసులను కనుక పూర్తిగా ఎత్తివేస్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 83 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టడానికి అదానీ సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రతిపాదించినట్లు మీడియా కోడైకూసింది. ఈ పెట్టుబడి ప్రతిపాదన కారణంగానే ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకుందా అనే కోణంలో జడ్జి కూడా ఒక దశలో అనుమానం వ్యక్తం చేశారు.

అదానీ ఖండన…
ఈ ఆరోపణలన్నింటినీ అదానీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. కేసుకు సంబంధించిన తొలగింపునకు ఎలాంటి ముందస్తు ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేస్తూ ఒక ప్రమాణపత్రాన్ని కూడా సమర్పించారు. అదానీ గ్రూప్ అనేది మన దేశంలో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమల నుంచి మీడియా హౌస్‌ల వరకు ఎన్నో రంగాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. ఇటీవల కాలంలో కొన్ని కార్పొరేట్ మోసాల ఆరోపణలు, స్టాక్ మార్కెట్ క్రాష్‌ల వల్ల అదానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

సన్నిహిత సంబంధాలు… సామాజిక పోస్టులు
గౌతమ్ అదానీకి భారత రాజకీయాల్లో, అంతర్జాతీయ స్థాయిలో మంచి పట్టు ఉంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన అత్యంత సన్నిహితులుగా గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఇద్దరూ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే కావడంతో తరచూ రాజకీయ విమర్శలకు కూడా గురికావాల్సి వస్తుంది. సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా అదానీకి బహిరంగ మద్దతుదారుడిగా నిలిచారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అమెరికా కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు ఎప్పుడూ సంపూర్ణమైన గౌరవం ఉందని సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *