- వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం
- ప్రధాని, సీఎం, మంత్రులందరికీ వర్తింపు
- కస్టడీకి వెళ్ళినప్పటికీ పదవి పోయినట్లే
- కస్టడీతోనే పదవికి ఎండ్ కార్డ్
- ఇది చట్టమా లేక రాజకీయ అస్త్రమా?
సహనం వందే, న్యూఢిల్లీ:
అధికారం అంటే శాశ్వతం అనుకునే వారికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన ఒక హెచ్చరిక. నిందితుడిగా 30 రోజులు కస్టడీలో ఉంటే చాలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినా కుర్చీ వదలాల్సిందేనని కమిటీ స్పష్టం చేస్తోంది. నేరం నిర్ధారణ కావాల్సిన అవసరం లేదు, కేవలం జైలు గడప తొక్కడమే పదవికి శాపంగా మారబోతోంది. ప్రజాస్వామ్య మూలాలను కదిలించే ఈ కీలక అంశంపై సమగ్ర విశ్లేషణ.
కస్టడీ వర్సెస్ శిక్ష
ప్రధాని లేదా ముఖ్యమంత్రులు 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే పదవి కోల్పోవాల్సిందే. ఇది చట్టంగా మారితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి ఈ చట్టం మెడపై కత్తిలా వేలాడుతుంది. ఇక కస్టడీని, జైలు శిక్షను మనం వేరుగా చూడాలి. కోర్టు శిక్ష పడితే పదవి పోవడం వేరు. కానీ ఇప్పుడు తెరపైకి వచ్చిన నిబంధన ప్రకారం కేవలం నెల రోజులు కస్టడీలో ఉన్నా చాలు. అంటే నేరం రుజువు కావడానికి ముందే కేవలం విచారణలో ఉన్నప్పుడే అధికారాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది ముమ్మాటికి రాజకీయ అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది.
తిరిగి అధికారం దక్కేనా?
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పదవిని చేపట్టవచ్చా అనే సందేహం సహజం. ఒకవేళ సదరు నాయకుడు నిర్దోషిగా బయటపడితే మళ్ళీ పదవిని చేపట్టే అవకాశం ఉండవచ్చు. కానీ ఆ నెల రోజుల్లో జరిగిన పాలనాపరమైన నిర్ణయాలు, సంక్షోభాల పరిస్థితి ఏమిటి. రాజకీయంగా కోల్పోయిన పట్టును తిరిగి సాధించడం అసాధ్యం. కాబట్టి ఈ నిబంధన ఆ నాయకుడి రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా ముగించే అవకాశం ఉంది.
రాజకీయ కక్షసాధింపునకు అవకాశం…
ఈ చట్టం ఒక ఆయుధంలా మారే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తే అక్రమంగా కేసుల్లో ఇరికించి 30 రోజులు కస్టడీలో ఉంచడం ఎంతో సులభం. అందుకే దీనిని అడ్డుకోవడానికి కమిటీ నిబంధనలు రూపొందిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులు లేకుండా కేవలం తీవ్రమైన నేరాలకు మాత్రమే పరిమితం చేయాలని కమిటీ భావిస్తోంది. ఇది అమలులోకి వస్తే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
చట్టపరమైన సవాల్
నేరం రుజువు కాకముందే అరెస్టు చేసి ఆ నెపంతో అధికారాన్ని తొలగించడం ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకవేళ న్యాయస్థానం తర్వాత సదరు నేతను నిర్దోషిగా ప్రకటిస్తే ఆ 30 రోజులు పదవిలో లేనందుకు బాధ్యత ఎవరిది. ప్రభుత్వం ఈ చిక్కుముడిని ఎలా విడదీస్తుందో చూడాలి. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు కీలకం కానున్నాయి.
ప్రజాస్వామ్యానికి పరీక్ష
కేవలం చట్టం చేయడంతో సరిపోదు. దానిని అమలు చేసే విధానంలో పారదర్శకత ఉండాలి. 30 రోజుల కస్టడీని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా నేర రహిత రాజకీయాలను ప్రోత్సహించాలని కమిటీ భావిస్తోంది. అయితే ఇది ప్రభుత్వాల కూల్చివేతకు కొత్త మార్గంగా మారకూడదు. జూలై 20 నుండి జరగబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దీనికి వేదిక కానున్నాయి.
130వ రాజ్యాంగం సవరణ…
భారత రాజ్యాంగంలో 130వ సవరణ ద్వారా రాబోతున్న ఈ మార్పు దేశంలోనే అతిపెద్ద రాజకీయ మార్పు కానుంది. జూలై 17న కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎలా స్పందిస్తాయో చూడాలి. 30 రోజులు కస్టడీలో ఉన్న నేతలకు పదవీగండం తప్పని పరిస్థితి వస్తే ఇకపై రాజకీయ నాయకులు కస్టడీకి దూరంగా ఉండేందుకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.