గడ్డి తింటున్న హీరోలు – షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌ల లీలలు

Hero's Advertisements Sharukh, Vijan
  • విమల్ ప్రచారంలో హాలీవుడ్ హీరోలు
  • ఉక్కు పాదం మోపిన మహారాష్ట్ర ఎఫ్‌డీఏ
  • వివరణ ఇవ్వాలని నటులకు నోటీసులు జారీ
  • వెండితెర హీరోలు… నిజ జీవితంలో విలన్లు

సహనం వందే, మహారాష్ట్ర:

తెరపై దేశాన్ని రక్షించే ధీరులు నిజ జీవితంలో మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం హానికరమైన పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్ష ప్రచారం చేస్తూ దొరికిపోయారు. విమల్ ప్రకటనలో నటించిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అద్దాల మేడల్లో అసలు నాటకం
సినిమా తెరపై మన నటులు కోట్లు కుమ్మరిస్తున్నారు. వారు బయటకు ఎంత స్టైలిష్‌గా కనిపించినా లోపల అసలు నాటకం వేరే ఉంది. గుట్కా వాసనలతో నిండిన ప్రకటనల్లో నటిస్తూ వీరు సమాజానికి చెడు సందేశం ఇస్తున్నారు. ఈ తీరుపై అధికారులు ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విమల్ ప్రకటనల వెనుక ఉన్న అసలు వ్యాపారాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న హీరోల వైఖరిపై చట్టం తన ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది.

sharukh, ajay Devagan and tigersharaf in advertisement issue

సరోగ్రఫీ ముసుగులో విక్రయాలు
ఈ ప్రకటనలో కేవలం ఇలాచీ సంబంధిత ఉత్పత్తులు అమ్ముతున్నట్లు చూపిస్తున్నారు. కానీ దీని వెనుక అసలు రూపం వేరే ఉందనేది అధికారుల ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో పాన్ మసాలా, గుట్కా విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంది. చట్టపరమైన లొసుగులను అడ్డుపెట్టుకుని ఇలాంటి పరోక్ష ప్రకటనలు చేస్తున్నారు. బ్రాండ్ పేరును ప్రజల మెదళ్లలో నాటడమే ఈ సరోగ్రఫీ అడ్వర్టైజింగ్ ముఖ్య ఉద్దేశం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏ రూపంలో ప్రచారం చేసినా అది నేరమే అవుతుంది.

పదిహేను రోజుల గడువు
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురు స్టార్ హీరోలకు అధికారికంగా షోకాజ్ నోటీసులు పంపారు. వారు రాబోయే 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకటనలతో వారికి ఉన్న సంబంధంపై పూర్తి వివరాలు కోరారు. ఒకవేళ నటులు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. డబ్బుల కోసం ఇలాంటి వస్తువులను ప్రమోట్ చేయడంపై మేధావులు మండిపడుతున్నారు.

ప్రాణాలతో చెలగాటం
కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈ నటులకు నైతిక బాధ్యత ఉండాలి. డబ్బు కోసం యువతను పెడదోవ పట్టిస్తే భావితరాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఎంతోమంది యువకులు ఇలాంటి అలవాట్ల వల్ల ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడుతున్నారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటుడు సన్నీ డియోల్ కూడా వీటిపై విమర్శలు చేశారు. డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఆయన చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

సెలబ్రిటీల సైలెంట్ పాత్ర
ప్రస్తుతం ఈ వివాదంపై షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారు ఏదో ఒక సాకుతో తప్పించుకున్నారు. కానీ ఈసారి నేరుగా ప్రభుత్వ యంత్రాంగమే నోటీసులు జారీ చేసింది. దీంతో వారు ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు తమ హీరోలను దేవుడిలా కొలుస్తారు. అందుకే హీరోలు కమర్షియల్ ప్రయోజనాలే కాకుండా సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి.

చట్టం ముందు అందరూ సమానులే
లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడే ఏ వ్యాపారానికైనా, దాన్ని ప్రమోట్ చేసేవారికైనా మూల్యం తప్పదు. ఈ కేసులో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ తీసుకోబోయే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. కేవలం నోటీసులతో సరిపెట్టకుండా మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలి. చట్టం ముందు తప్పు చేసిన వారు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేసే బ్రాండ్లకు, నటులకు ఈ ఘటన ఒక గట్టి హెచ్చరిక.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *