నగరం మధురమైన జీవితం – ప్రపంచంలో నివసించదగ్గ సిటీలు ఇవేనట

Top 20 Cities in the World
  • నివసించదగ్గ సిటీలు ఇవేనట
  • కోపెన్‌హాగన్ ఫస్ట్… వియన్నాకు రెండో స్థానం
  • అమెరికాలోని నగరాలన్నీ వేస్టేనా?
  • జాబితాలో లేని ఇండియన్ సిటీస్

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచంలో మనుషులు హాయిగా జీవించడానికి ఏ నగరం అత్యంత అనుకూలమైనది? ఈ ప్రశ్నకు ప్రతి ఏటా సమాధానం వెతికే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, తాజాగా 2026 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక… ఒక వైపు అద్భుతమైన జీవన ప్రమాణాలు, మరోవైపు యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన నగరాల గతిని కళ్లకు కడుతోంది.

కోపెన్‌హాగన్ జైత్రయాత్ర
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. స్థిరత్వం, మౌలిక సదుపాయాలు, విద్య అనే మూడు విభాగాల్లో కోపెన్‌హాగన్ పరిపూర్ణమైన స్కోరు సాధించింది. గతంలో మూడేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రియా రాజధాని వియన్నా ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది.

ప్రపంచంలో నివసించదగ్గ సిటీలు ఇవేనట

నివసించదగ్గ సిటీలు ఇవేనట


టాప్ 10 జాబితాలో ఆస్ట్రేలియా నగరాలు సత్తా చాటాయి. మెల్‌బోర్న్ 3వ స్థానానికి ఎగబాకగా, సిడ్నీ 6 నుంచి 4వ స్థానానికి దూసుకొచ్చింది. జ్యూరిచ్ 3 స్థానాలు కోల్పోయి 5వ స్థానంలో నిలిచింది. జెనీవా 6, ఒసాకా 7, అడిలైడ్ 8వ స్థానాల్లో ఉన్నాయి. కెనడా నుంచి వ్యాంకూవర్ 9వ స్థానంలో ఉండగా, టోక్యో 10వ స్థానంతో టాప్ 10 లిస్టులో నిలిచింది.

అమెరికా నగరాల దుస్థితి
అమెరికా నగరాల పనితీరు మిశ్రమంగా ఉంది. హోనొలులు 2 స్థానాలు కోల్పోయి 25వ స్థానానికి పడిపోయింది. న్యూయార్క్ నగరంలో నేరాలు తగ్గడం, ఉగ్రవాద ముప్పు తక్కువగా ఉండటంతో 3 స్థానాలు మెరుగుపడి 66వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ యూరప్, ఆస్ట్రేలియా నగరాలతో పోటీ పడటానికి అమెరికా నగరాలకు ఇంకా చాలా సమయం పడుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది.

బ్రిటన్‌లో మారుతున్న సమీకరణాలు
గత ఏడాది అశాంతి, ఆందోళనలతో దెబ్బతిన్న యునైటెడ్ కింగ్‌డమ్ కోలుకుంది. బ్రిటన్‌లో మాంచెస్టర్ నగరం వరుసగా రెండో ఏడాది 52వ స్థానంతో అత్యుత్తమంగా నిలిచింది. లండన్ 54, ఎడిన్‌బర్గ్ 64వ స్థానాల్లో ఉన్నాయి. పశ్చిమ యూరప్ ప్రాంతం 91.7 సగటు స్కోరుతో బలంగా ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది.

గల్ఫ్ దేశాలపై యుద్ధ ప్రభావం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. మస్కట్ 14 స్థానాలు కోల్పోయి 123వ స్థానానికి, కువైట్ సిటీ 12 స్థానాలు కోల్పోయి 105వ స్థానానికి పడిపోయాయి. యుద్ధం సరిహద్దులకే పరిమితం కాకుండా పొరుగు నగరాల జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

యుద్ధంతో కుదేలైన నగరాలు
జాబితాలో చివరన ఉన్న నగరాల పరిస్థితి ఘోరంగా ఉంది. సిరియాలోని డమాస్కస్ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యం కాని నగరంగా అగ్రస్థానంలో ఉంది. యుద్ధం కారణంగా టెహ్రాన్ 164వ స్థానానికి, ఉక్రెయిన్ రాజధాని కీవ్ 166వ స్థానానికి పడిపోయాయి. రెండు యుద్ధాలు, మిలియన్ల మంది ప్రజల జీవితాలు ఈ నగరాల్లో ఛిద్రమయ్యాయని నివేదిక హెచ్చరిస్తోంది. విచిత్రం ఏంటంటే భారతదేశంలోని నగరాలు ఈ జాబితాలో చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది.

Take a look on our English Version in Article Today

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *