- ఈవీలకు పవర్ బ్యాంకు తరహా ఫాస్ట్ ఛార్జింగ్
- కరెంట్ పోయినా కార్ ఛార్జింగ్
- పవర్‌గ్రిడ్ అప్‌గ్రేడ్స్ అక్కర్లేని సరికొత్త ఫీచర్
- పార్కింగ్ లేనివారికి ఆన్-స్ట్రీట్ చార్జర్లు
- సరసమైన ధరలే ఈవీకి పునాది
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ, చార్జింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సొంతంగా ప్రైవేట్ పార్కింగ్ స్థలం లేని వారి పరిస్థితి వర్ణనాతీతం. అపార్ట్మెంట్లలో నివసించే వారికి, ఇళ్ల ముందు పార్క్ చేసే వారికి రాత్రిపూట వాహనాన్ని ఎలా చార్జ్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈవీ మొబిలిటీ విజయం సాధించాలంటే రోజువారీ డ్రైవింగ్ అలవాట్లకు సరిపోయేలా ఈ నెట్వర్క్ రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది.
ఇన్వర్టర్ చార్జింగ్ సూత్రం
మన ఇంట్లో వాడే ఇన్వర్టర్ కరెంట్ ఉన్నప్పుడు పవర్‌ను బ్యాటరీలో దాచుకుని, కరెంట్ పోయినప్పుడు వెలుగునిస్తుంది. సరిగ్గా ఇదే వినూత్న సూత్రాన్ని బ్యాటరీ ఆధారిత ఫాస్ట్ చార్జర్లలో ఉపయోగిస్తున్నారు. చార్జింగ్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ అమర్చి ఉంటుంది. ఇది పవర్ గ్రిడ్ నుంచి రోజంతా తక్కువ కరెంట్‌ను మాత్రమే నిల్వ చేసుకుంటుంది. ఏదైనా కారుకు అత్యవసరంగా చార్జింగ్ పెట్టాల్సి వస్తే, ఈ బ్యాటరీయే పవర్‌ను కారులోకి నిమిషాల్లో పంప్ చేస్తుంది. దీనివల్ల పవర్‌గ్రిడ్ పై పడే భారం తగ్గుతుంది. కోట్ల రూపాయలు తగలేసి పవర్ లైన్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన తిప్పలు విద్యుత్ శాఖలకు తప్పుతాయి. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక వెల్లడించింది.

సరికొత్త ఆన్-స్ట్రీట్ చార్జింగ్
సొంతంగా పార్కింగ్ స్థలాలు లేని నివాసితులకు ఊరటనిచ్చేందుకు ‘ఆన్-స్ట్రీట్ చార్జింగ్’ అనే సరికొత్త ప్రత్యామ్నాయం తీసుకొస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొత్తగా పవర్ లైన్లు లాగాల్సిన పని లేదు. సమీపంలో ఉన్న భవనాలు లేదా ఇళ్లలోని అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుని రోడ్ల పక్కనే ఈ పాయింట్లను అమర్చుతారు. రాత్రి సమయంలో రోడ్డు పక్కన కార్లను పార్క్ చేసేవారు తమ వాహనాలను సులభంగా చార్జ్ చేసుకోవడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది.
చార్జింగ్ విజయానికి మూడు సూత్రాలు
అయితే ఎలక్ట్రిక్ చార్జింగ్ వ్యవస్థను విస్తరించడం అంటే కేవలం చార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుకుంటూ పోవడం మాత్రమే కాదు. ఆ చార్జర్లు ఏ లొకేషన్లో అమర్చారు? అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి? వాటి ధరలు సామాన్యుడికి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? అనేదే ఇక్కడ అసలైన మర్మం. వాహనదారుడి ప్రయాణానికి భంగం కలగకుండా అనువైన ప్రదేశాల్లో ఇవి ఉండాలి. మెషీన్ పాడైపోకుండా నిరంతరం పనిచేస్తూ నమ్మకాన్ని ఇవ్వాలి, అలాగే చార్జింగ్ ఖర్చు పెట్రోల్ కన్నా చవకగా ఉండాలి.
నెట్వర్క్ లోపాల సరిదిద్దుబాటు
ఈవీ విప్లవం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే కేవలం కొత్త రకం కార్లను మార్కెట్లోకి తేవడం మాత్రమే సరిపోదు. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ లోపాలను సరిదిద్దుతూ ఇన్వర్టర్ తరహా ఫాస్ట్ చార్జర్లు, ఆన్-స్ట్రీట్ చార్జర్లు వంటి ఆధునిక సాంకేతిక పరిష్కారాలను వేగంగా అందుబాటులోకి తేవాల్సి ఉంది. ప్రతి నగరవాసికి సులభంగా, చవగ్గా చార్జింగ్ సదుపాయం అందించినప్పుడే ఎలక్ట్రిక్ రవాణా స్వప్నం సాకారమవుతుంది.