- టీనేజర్లను బానిసలుగా మారుస్తున్న దుస్థితి
- అమెరికా కోర్టుల్లో వేల కేసులు, ఫిర్యాదులు
- ప్రజల ఒత్తిడికి దిగివచ్చిన మెటా జుకర్‌బర్గ్
- లక్షన్నర కోట్ల భారీ జరిమానాకు అంగీకారం
- రాత్రిపూట సోషల్ మీడియా నిలుపుదల
సహనం వందే, అమెరికా:
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా దిగ్గజం మెటాపై అమెరికా కోర్టులో జరిగిన చారిత్రాత్మక పోరులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లక్షన్నర కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించేందుకు ఆ కంపెనీ దిగివచ్చింది. అమెరికాలోని 29 రాష్ట్రాలు కలిసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చారిత్రాత్మక పోరాటాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
పిల్లలను బానిసలుగా మారుస్తున్న డిజైన్లు
జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు చిన్నపిల్లలను, యువతను తమ వైపు తిప్పుకునేలా వివిధ డిజైన్లతో వారిని బానిసలుగా మారుస్తున్నాయని కేసులు నమోదయ్యాయి. ఈ డిజైన్ల వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమైపోతోందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు హాని కలిగించే అంశాలపై అమెరికా కోర్టులో జరిగిన ఈ సుదీర్ఘ పోరు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది.

కొత్త మార్పులు తెస్తున్న అటార్నీ జనరల్…
కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా ఈ ఒప్పందంపై మాట్లాడుతూ మెటా ఇకపై తమ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి పూట పిల్లలు ఫోన్లకు అతుక్కుపోకుండా ఉండటానికి ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టీనేజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను అసలు వాడకుండా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే సిస్టమ్‌ను తీసుకురానున్నారు.
రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే…
అలాగే రోజువారీ వాడకంపై కూడా గరిష్ట పరిమితులను విధించారు. టీనేజర్ల ఖాతాలకు డిఫాల్ట్‌గా రోజుకు కేవలం 2 గంటల పాటు మాత్రమే సోషల్ మీడియాను వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ 2 గంటల పరిమితిలో మెసేజింగ్ చేసుకోవడం లేదా పెద్ద వీడియోలను చూడడం వంటివి కలపరు కాబట్టి కేవలం స్క్రోలింగ్ చేసే సమయానికే ఇది వర్తిస్తుంది.
మిగతా యాప్‌లకూ వర్తింపచేయాలని విన్నపం
ఒకవేళ మిగతా సోషల్ మీడియా యాప్‌లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే, ఈ రాత్రి పూట బ్లాక్ చేసే సమయాన్ని 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తామని మెటా ప్రకటించింది. అలాగే రోజువారీ గరిష్ట సమయాన్ని కేవలం అర గంట నుంచి గంట లోపు పరిమితం చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నింటినీ ఇతర ప్రత్యర్థి సంస్థలైన టిక్‌టాక్, యూట్యూబ్ కూడా వెంటనే అమలు చేయాలని మెటా కోరింది.
ఇతర దేశాల్లోనూ డిమాండ్లు…
సోషల్ మీడియా కంపెనీల ఈ మోసపూరిత డిజైన్ల వల్ల కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో చిన్న పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాల్‌గా మారింది. అందుకే ఇలాంటి కఠినమైన నిబంధనలు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.