డ్రగ్స్ దాడి… జిమ్ ‘బాడీ’ – ఫిట్‌నెస్ ముసుగులో దందా

Gym Vs Drugs Danda
  • టెలిగ్రామ్ వేదికగా చీకటి వ్యాపారం
  • స్టెరాయిడ్స్ అమ్మకాల్లో ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర
  • అక్రమంగా కొనసాగుతున్న మత్తు మార్కెట్

సహనం వందే, హైదరాబాద్:

జిమ్ కు వెళ్లే యువతపై ఇప్పుడు మత్తు మందుల ఉచ్చు వేటాడుతోంది. ఫిట్‌నెస్ బ్రాండ్ల ముసుగులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెరవెనుక అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ స్టెరాయిడ్ల అమ్మకాలను నడిపిస్తూ యువతను అనారోగ్యాల ఊబిలోకి నెట్టేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పక్కా వ్యూహంతో సాగుతున్న ఈ డ్రగ్స్ దందా ఇప్పుడు సంచలనం రేపుతోంది.

తెరవెనుక చీకటి సామ్రాజ్యం
జెన్‌కోర్ గ్లోబల్ అనే సంస్థ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల పేరుతో మార్కెట్లోకి వచ్చింది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఫిట్‌నెస్ ఈవెంట్లలో పాల్గొంటూ నమ్మకం కలిగిస్తోంది. కానీ లోపల జరుగుతున్నది మరోటి. సంస్థకు చెందిన 12 మంది అంబాసిడర్లు, ఉద్యోగులు కలిసి అక్రమంగా స్టెరాయిడ్ల అమ్మకాలను చేపడుతున్నారు. టెలిగ్రామ్‌ వేదికగా అనాబాలిక్ బై నేచర్ పేరుతో వీరు ఒక నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. దీనికి ముందు రోమ్ అనే పేరుతో ఈ దందా సాగగా… అది మూతపడటంతో పేరు మార్చి మళ్లీ మొదలుపెట్టారు.

ఇన్ఫ్లుయెన్సర్ల వల
సోషల్ మీడియాలో వీరికి 1.8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతను ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఆకర్షిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లుగా అవతారం ఎత్తి కమిషన్ల పేరుతో అమాయక యువతను మభ్యపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి అక్రమ మార్గంలోకి లాగుతున్నారు. శిక్షణ, ఆరోగ్య పరీక్షల పేరుతో మొదలయ్యే సంభాషణలు చివరకు ప్రాణాంతకమైన డ్రగ్స్ వైపు మళ్లుతున్నాయి.

ప్రమాదకరమైన మత్తుమందులు
అనాబాలిక్ స్టెరాయిడ్లు టెస్టిస్టెరాన్ హార్మోన్ల కృత్రిమ రూపాలు. ఇవి కండరాలను వేగంగా పెంచుతాయని నమ్మించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీటి వల్ల వంధ్యత్వం, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.‌ ప్రమాదకరమైన పెప్టైడ్లను కూడా వీరు విక్రయిస్తున్నారు. టైర్జెపటైడ్ వంటి బరువు తగ్గించే మందులను కూడా అక్రమంగా అమ్ముతున్నారు.

వ్యవస్థీకృత నేరం
ఈ నెట్‌వర్క్ వెనుక జెన్‌కోర్ వ్యవస్థాపకుడు డారెన్ విక్స్ కీలకంగా ఉన్నాడు. టెలిగ్రామ్ గ్రూపుల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ స్టాక్ అప్‌డేట్స్ ఇస్తుంటాడు. అక్రమ దందా కావడంతో వెబ్‌సైట్లు తరచుగా మూతపడుతున్నా వాటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. విమాన ప్రయాణాల్లో స్టెరాయిడ్లను ఎలా తరలించాలో కూడా ఇతడు సలహాలు ఇస్తున్నాడు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లేటప్పుడు తనతో పాటు భారీగా మందులు తీసుకెళ్తానని ఎవరూ అడగడం లేదని విర్రవీగుతున్నాడు.

డ్రగ్స్ వాడకం ఇప్పుడొక ఫ్యాషన్
జిమ్ కల్చర్ పేరుతో ఈ డ్రగ్స్ వాడకం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆకర్షణీయమైన శరీరం కోసం యువత ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. సౌందర్యం, పురుషత్వం వంటి అంశాలతో స్టెరాయిడ్లను ముడిపెట్టి సమాజంలో ఒక ప్రమాదకరమైన ధోరణిని సృష్టిస్తున్నారు. ఇది కేవలం ఫిట్‌నెస్ కాదు, ఒక వ్యసనం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్ కు వెళ్లే ప్రతి ఒక్కరూ స్టెరాయిడ్లు వాడుతున్నారనే భ్రమను కలిగించి అమాయకులను ఈ దందాలోకి లాగుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *