- రంగంలోకి సీఐడీ.. 14 మంది అరెస్ట్!
- సన్న రకం గోల్మాల్… భారీగా నిధుల బదిలీ
- రూ.242 కోట్ల గండి… ముమ్మర తనిఖీలు
- కొందరు అధికారుల పాత్ర పైన అనుమానాలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లుల యజమానులు చేసిన పెద్ద దగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అందజేయాల్సిన సన్న రకం బియ్యం స్థానంలో చౌకబారు దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం కలిగించారనే ఆరోపణలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు ప్రారంభించింది.
అసలు విషయం ఏమిటి?
ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ఏకంగా 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించింది. ఇందులో భాగంగా 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉంది. అయితే కొందరు కేటుగాళ్లైన రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చిన మాటను తప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన నాణ్యమైన సన్న రకం వరిని బయటి మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకున్నారు. ఆ స్థానంలో బయట రాష్ట్రాల నుంచి చౌకగా దొరికే దొడ్డు రకం బియ్యాన్ని తెప్పించి ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ కింద సరఫరా చేశారనే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో బయటపడిన దగా…
టాస్క్ ఫోర్స్ బృందాలు రైస్ మిల్లులపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమాలు రట్టయ్యాయి. ల్యాబ్‌లలో ఈ బియ్యం నమూనాలను విశ్లేషించగా, వారు పంపిన బియ్యం ఏమాత్రం నిర్దేశించిన సన్న రకం ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులు సన్న రకం బియ్యానికి బదులుగా 3,385 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల కేవలం బోనస్ రూపంలోనే ప్రభుత్వానికి రూ. 1.69 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
రూ. 242 కోట్ల భారీ నష్టానికి కుట్ర
ఇది కేవలం కొద్ది మొత్తానికే పరిమితం కాలేదు. కన్వర్షన్ పేరుతో మరో 45,414 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తయి ఉంటే బోనస్ రూపంలోనే ప్రభుత్వానికి సుమారు రూ. 242 కోట్ల భారీ ఆర్థిక గండి పడేదని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. అయితే పౌర సరఫరాల శాఖ అధికారులు సకాలంలో స్పందించి, ఆ ప్రక్రియను నిలిపివేయడం వల్ల జరగబోయే పెద్ద ప్రమాదం తప్పిందని సీఐడీ వెల్లడించింది.
మూడు క్రిమినల్ కేసులు… 14 మంది అరెస్ట్
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) ఈ నెల 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ విచారణను వేగవంతం చేసింది. నిబంధనల ఉల్లంఘన, నమ్మకద్రోహం, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కుట్ర పన్నడం లాంటి తీవ్రమైన ఆరోపణలపై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన 14 మంది రైస్ మిల్లర్లను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
విచారణ… పరిణామాలు
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంటరీ, ఆధారాలను సీఐడీ బృందాలు సేకరిస్తున్నాయి. మిల్లుల యజమానులతో పాటు వారికి సహకరించిన అధికారులు లేదా ఇతరుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. అసలు ఎంత నష్టం వాటిల్లింది, కేటాయింపులు ఎలా జరిగాయి, మళ్లింపుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చేందుకు సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.