- 17 ప్రో కంటే వేగం పెరిగిన చిప్సెట్
- కెమెరాలో విప్లవాత్మక మార్పు
- ఆశ పెట్టే మార్కెటింగ్…
సహనం వందే, హైదరాబాద్:
పాత ఫోన్ మెరుస్తూనే ఉంది… కానీ కొత్త ఫోన్ కోసం యాపిల్ సంస్థ ఉసిగొల్పుతోంది. సెప్టెంబర్ 8న రాబోతున్న కొత్త ఫోన్ కోసం లక్షలు ఖర్చు చేయడం అవసరమా అనే ప్రశ్న వినియోగదారులను వేధిస్తోంది. సాంకేతిక మార్పుల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు రంగును ఇప్పుడు నిశితంగా విశ్లేషించుకుందాం.
ప్రాసెసర్ వేగం పెంచే వ్యూహం
యాపిల్ సంస్థ కొత్త 18 ప్రో ఐఫోన్లో 2 నానోమీటర్ల ఏ20 ప్రో చిప్‌సెట్‌ను పరిచయం చేస్తోంది. 17 ప్రోలో ఉన్న 3 నానోమీటర్ చిప్సెట్ ఇప్పటికే అత్యంత వేగవంతమైనది. కొత్త చిప్సెట్ వల్ల ఫోన్ వేగం కేవలం 15 శాతం మాత్రమే పెరుగుతుందని యాపిల్ చెబుతోంది. ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా లేదా ఎడిటింగ్ చేయాలన్నా ఈ మార్పు పెద్దగా కనిపించదు. కేవలం ఈ స్వల్ప మార్పు కోసం వేల రూపాయలు వెచ్చించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి.

కెమెరా సాంకేతికతలో మాయాజాలం
కెమెరా విషయంలో మెకానికల్ వేరియబుల్ అపెర్చర్‌ను యాపిల్ తీసుకొస్తోంది. ఇది ఫోటో తీసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ను నియంత్రించేలా రూపొందించారు. పెద్ద డీఎస్ఎల్ఆర్ కెమెరాల తరహాలో దీన్ని మార్చామని చెబుతున్నా ఇది ప్రాథమికంగా ఒక మార్కెటింగ్ జిమ్మిక్కు. మొబైల్ ఫోటోగ్రఫీలో ఇది పెద్ద మార్పుగా కనిపిస్తున్నా సాధారణ వినియోగదారులకు దీనివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు.
స్క్రీన్ స్పేస్ పెంచే ప్రయత్నం
డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని 35 శాతం తగ్గించాలని యాపిల్ నిర్ణయించింది. ఫేస్ ఐడీ సెన్సార్లను స్క్రీన్ కిందకు దాచడం ద్వారా స్క్రీన్ స్పేస్ పెరుగుతుందని సంస్థ వాదిస్తోంది. ఇది వీడియోలు చూసేటప్పుడు కాస్త స్పష్టతను ఇస్తుందంతే. అంతకు మించి డిస్ప్లే డిజైన్‌లో విప్లవాత్మక మార్పులు ఏమీ లేవు. పాత మోడల్లో ఉన్న డిజైన్ కూడా ఇప్పటికీ అద్భుతంగానే ఉంది.
సొంత మోడమ్తో బ్యాటరీ ఆదా
క్వాల్కమ్ మోడమ్లను తొలగించి సి-2 మోడమ్‌ను యాపిల్ సొంతంగా తయారు చేస్తోంది. దీనివల్ల బ్యాటరీ ఆదా అవుతుందని శాటిలైట్ ఇంటర్నెట్ వాడుకోవచ్చని చెబుతున్నారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం మంచి పరిణామమే. అయితే ఈ ఒక్క సౌకర్యం కోసం భారీ ధర చెల్లించడం ఏ మేరకు సమంజసమో వినియోగదారులు బేరీజు వేసుకోవాలి.
గ్రాఫేన్ కూలింగ్ సిస్టమ్ ప్రాముఖ్యత
ఐఫోన్లు వేడెక్కుతున్నాయని వస్తున్న ఫిర్యాదులకు చెక్ పెట్టేందుకు గ్రాఫేన్ థర్మల్ కూలింగ్ సిస్టం వాడుతున్నారు. ఏఐ ఫీచర్లు వాడేటప్పుడు ఫోన్ చల్లగా ఉండటానికి ఇది సహకరిస్తుంది. ఏఐ ఫీచర్లు ఇప్పటికే ఐఫోన్ 17 ప్రోలో యాపిల్ ఇంటెలిజెన్స్ కింద అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా పాత ఫోన్లను కూడా యాపిల్ కొత్తగా మారుస్తోంది. హార్డ్‌వేర్ కోసం పరితపించడం కంటే సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని వాడుకోవడం తెలివైన పని.
ధరల మోతతో మార్కెటింగ్ జిమ్మిక్కు
కొత్త ఫోన్ ధర సుమారు 1,08,000 రూపాయలకు పైగా ఉండవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసినా 50 నుండి 60 వేల రూపాయల భారం సామాన్యుడిపై పడుతుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, గేమర్లకు తప్ప ఇది అవసరం లేదు. కేవలం ఆకర్షణకు లోనై కష్టపడి సంపాదించిన డబ్బును వృథా చేసుకోవద్దు. యాపిల్ తీసుకొచ్చే మార్పులు జీవనశైలిని మార్చేవి కావని గుర్తించాలి.