- పురుషులతో పోలిస్తే జీవితకాలం ఎక్కువ
- అనారోగ్యంతో గడుపుతున్న కాలం అధికం
- అనీమియాతో సతమతమవుతున్న స్త్రీ
సహనం వందే, హైదరాబాద్:
భారత మహిళల జీవితకాలం పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆయుష్షు పెరుగుదల మెరుగైన వైద్యానికి సంకేతం కావచ్చు. కంటికి కనిపించని అనారోగ్య సమస్యలు మహిళల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. మనం గర్వపడే గణాంకాల వెనుక భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. ఆయుష్షు పెరిగినా ఆరోగ్య నాణ్యత పడిపోతోంది. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది.
పెరిగిన ఆయుష్షు…
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 గణాంకాల ప్రకారం భారత మహిళల సగటు ఆయుష్షు 69 ఏళ్లుగా ఉంది. అదే పురుషుల ఆయుష్షు 65.8 ఏళ్లు మాత్రమే. అంటే పురుషుల కంటే మహిళలు 3.2 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఇది వినడానికి బాగున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్య సదుపాయాలు పెరగడం వల్ల మరణాల రేటు తగ్గుతోంది. అయితే ఆ పెరిగిన ఆయుష్షును మహిళలు ఎంత ఆరోగ్యంగా గడుపుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆరోగ్య కాలంలో అంతరం లేదు
హెల్తీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ లెక్కలు వేరే విషయాన్ని చెబుతున్నాయి. మహిళలు కేవలం 58.3 ఏళ్లు మాత్రమే ఆరోగ్యంగా జీవించగలరు. పురుషుల ఆరోగ్యకరమైన జీవితకాలం 58 ఏళ్లుగా ఉంది. మహిళల ఆయుష్షు ఎక్కువగా ఉన్నా ఆరోగ్యంగా బతికే కాలంలో తేడా ఏమీ లేదు. అంటే పెరిగిన ఆయుష్షు కాలమంతా అనారోగ్యంతోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కువ కాలం అనారోగ్యంగా బతకడం ఇప్పుడు మహిళలకు భారంగా మారుతోంది.
అనారోగ్యంతోనే దశాబ్దం
మహిళలు తమ జీవితంలో 10 ఏళ్ల పాటు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది పురుషులతో పోలిస్తే 2.7 ఏళ్లు ఎక్కువ. భారత మహిళలు తమ మొత్తం జీవితకాలంలో 15.5 శాతం సమయాన్ని అనారోగ్యంతో గడుపుతున్నారు. పురుషుల విషయంలో ఇది 11.9 శాతం మాత్రమే ఉంది. ఎక్కువ కాలం బతకడం వల్ల ఎక్కువ కాలం అనారోగ్యాన్ని భరించాల్సి వస్తోంది. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
సైలెంట్ కిల్లర్‌గా అనీమియా
ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణం అనీమియా. 15 నుండి 49 ఏళ్ల వయస్సు గల మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇదే వయస్సు గల పురుషుల్లో రక్తహీనత 25.1 శాతం మాత్రమే ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత రెట్టింపు స్థాయిలో ఉంది. ఇది కేవలం నీరసం మాత్రమే కాదు, ప్రాణాంతక సమస్యలను కూడా తెస్తోంది. చిన్నప్పటి నుండే సరైన పౌష్టికాహారం అందకపోవడం దీనికి ప్రధాన కారణం.
పని సామర్థ్యంపై దెబ్బ
రక్తహీనత వల్ల రోగ నిరోధక శక్తి పడిపోతోంది. గర్భధారణ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతరం అలసట వారి పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. ఆయుష్షు పెరిగినా నాణ్యత లేని జీవితం వారిని కుంగదీస్తోంది. ఇంట్లో అందరి ఆరోగ్యం చూసుకునే మహిళలు తమ సొంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వివక్ష తరం మారినా ఇంకా కొనసాగుతూనే ఉంది.
మార్పు కోసం అడుగులు
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం ఎక్కువ కాలం బతకడం కాదు, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. మహిళల ఆరోగ్యం మెరుగుపడితేనే కుటుంబం బాగుపడుతుంది. పోషకాహారం, ఆరోగ్య పరీక్షలపై మహిళలకు అవగాహన పెరగాలి. ప్రభుత్వం ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుడే ఈ ఆయుష్షు గణాంకాలు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి.