స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

  • దీంతో అప్రాధాన్య పోస్టుల్లో నియామకం
  • అయినా పట్టించుకోని సీనియర్ ఐఏఎస్
  • అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు అన్ని ఏర్పాట్లు
  • దీంతో అకస్మాత్తుగా 6 నెలల సెలవుల్లో స్మిత
  • ఆమెపై వేలాడుతున్న కాళేశ్వరం కమిషన్ కత్తి

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకపాత్ర పోషించిన స్మితా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల్లో భాగమయ్యారు. అందుకే ఆమె ఈ సమయంలో సెలవు తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

వేలాడుతున్న కాళేశ్వరం కమిషన్ కత్తి…
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్మితా సబర్వాల్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఆమె ప్రాజెక్టు నిర్ణయాల్లో ముఖ్య పాత్ర పోషించినందున కమిషన్ సిఫార్సుల మేరకు ఆమెపై ఏసీబీ కేసు నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరగడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమె సెలవు తీసుకోవడం విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రేవంత్ సర్కారు పక్షపాతం చూపుతోందా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్‌ను అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె దూకుడు నిర్ణయాలు, ప్రజల మధ్య ఉన్న ఆదరణ కారణంగా కీలక పదవిలో ఉన్నారు. కానీ గత ఐఏఎస్ బదిలీల్లో ఆమెను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఇది ఆమె స్థాయికి తగిన పదవి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ప్రభుత్వంతో ఆమెకున్న సన్నిహిత సంబంధాల వల్లే ప్రభుత్వం ఆమెను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని విమర్శలు వస్తున్నాయి.

అయితే గత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నవారు అనేకమంది ఇప్పుడు కూడా ప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. అంతెందుకు మాజీ మంత్రి హరీష్ రావు వద్ద పీఎస్ గా పనిచేసిన అశోక్ రెడ్డి… నాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు… అప్పటి ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వంటి వాళ్లంతా కూడా ఇప్పుడు ప్రాధాన్యం గల పోస్టులోనే ఉన్నారు. కానీ స్మిత సబర్వాల్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా ఉండటం గమనార్హం.

సెలవు వెనుక ఆరోగ్యమా? రాజకీయమా?
స్మితా సబర్వాల్ సెలవుకు సంబంధించిన జివో మంజూరైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో తన ఆరోగ్య సమస్యల గురించి పోస్టు పెట్టారు. వెన్నుపూస నరం చీలిక కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. అయితే చైల్డ్ కేర్ సెలవు పేరుతో ఆరోగ్య సమస్యలను చెప్పడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. కాళేశ్వరం విచారణ ఒత్తిడి నుంచి బయటపడేందుకే ఈ సెలవు ఒక వ్యూహమని కొందరు ఆరోపిస్తున్నారు. నిజాయితీ, ధైర్యం ఉన్న ఆమె ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి…
స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీసింది. ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో నేరుగా సంభాషించడం, తన నిర్ణయాలను బహిరంగంగా సమర్థించుకోవడం వంటి వాటితో యువతలో ఆదరణ పొందారు. ఇప్పుడు ఆమె సెలవు, ఆరోగ్య సమస్యల గురించి పెట్టిన ట్వీట్లు ప్రజల్లో సందేహాలు రేకెత్తించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, అసెంబ్లీ చర్చలు, స్మితా సెలవు నిర్ణయం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయా అనే ప్రశ్నలు రాజకీయ రగడను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *