- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
- హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు
సహనం వందే, ఢిల్లీ:
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాముడిని పురాణ పాత్రగా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని కలిగి ఉందని, రాహుల్ రామ వ్యతిరేకి అని విమర్శించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో రాముడిని పురాణ పాత్రగా పేర్కొన్నారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే లౌకిక రాజకీయాలను ఎలా రూపొందించాలనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలోని గొప్ప సాంఘిక సంస్కర్తలు, రాజకీయ ఆలోచనాపరులు ఎవరూ మతోన్మాదులు కాదని, బీజేపీ ఆలోచనను హిందూ భావనగా తాను పరిగణించనని గాంధీ అన్నారు ‘బీజేపీ చెప్పేది హిందూ భావన అని నేను అనుకోను. హిందూ భావన మరింత బహుళవాదంతో, మరింత కలుపుగోలుగా, మరింత ఆప్యాయంగా, మరింత సహనంతో, మరింత బహిరంగంగా ఉంటుందని’ నేను భావిస్తున్నాను అని రాహుల్ అన్నారు
‘అలాంటి ఆలోచనల కోసం నిలబడిన, అలాంటి ఆలోచనల కోసం జీవించిన, అలాంటి ఆలోచనల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ప్రతి రాష్ట్రంలో, ప్రతి సమాజంలో ఉన్నారు. గాంధీజీ వారిలో ఒకరు. ప్రజలపై ద్వేషం, కోపం భయం నుంచే వస్తాయని నేను భావిస్తున్నాను. మీరు భయపడకపోతే, మీరు ఎవరినీ ద్వేషించర’ని రాహుల్ గాంధీ చెప్పారు.