- ఒక రకమైన విషపు పుట్టగొడుగులతో కూర
- విషపు భోజనం పెట్టి అత్త మామల ఊచకోత
- ఆస్ట్రేలియాను కుదిపేసిన ఇల్లాలి మర్డర్ స్కెచ్
- రెండేళ్లనాటి మర్డర్… తాజాగా కోర్టులో వాదన
సహనం వందే, ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఒక భయంకరమైన నేరం వెలుగు చూసింది. ఒక ఇల్లాలు తన రక్త సంబంధీకులకే విషం పెట్టి ముగ్గురి ప్రాణాలు తీసింది. మరొకరు చావు బతుకుల మధ్య ఎలాగో అలా బయటపడ్డారు. 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్ అనే మహిళ పథకం ప్రకారం విషపూరితమైన పుట్టగొడుగులతో వండిన భోజనం వడ్డించి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2023 జూలైలో లియోంగాథాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఎరిన్‌పై మూడు హత్య కేసులు, ఐదు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. తన మాజీ భర్త తల్లి దండ్రులను, అత్తను ఆమె విషంతో చంపింది. బంధుత్వాల మధ్య ఇంతటి దారుణం జరగడం ఆస్ట్రేలియా సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
విందుకు పిలిచి మర్డర్…
2023 జూలై 29న ఎరిన్ ప్యాటర్సన్ తన ఇంట్లో నలుగురు బంధువులకు విందు ఏర్పాటు చేసింది. ఆ విందులో వడ్డించిన బీఫ్ వెల్లింగ్టన్ అనే వంటకంలో ప్రాణాంతకమైన పుట్టగొడుగులు కలిశాయని పోలీసులు నిర్ధారించారు. ఈ భోజనం తిన్న గెయిల్ ప్యాటర్సన్ (70), డాన్ ప్యాటర్సన్ (70), హీథర్ విల్కిన్సన్ (66) తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్ (68) మాత్రం 52 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘోరమైన నేరంలో ‘డెత్ క్యాప్’ (అమనిటా ఫల్లోయిడ్స్) అనే అత్యంత విషపూరితమైన పుట్టగొడుగులను వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ పుట్టగొడుగులను తింటే కాలేయం, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని మరణిస్తారు.
మాజీ భర్తపై కూడా హత్యా ప్రయత్నం…
ఎరిన్ ప్యాటర్సన్‌పై నమోదైన మూడు హత్య కేసులతో పాటు, ఆమె తన మాజీ భర్త సైమన్ ప్యాటర్సన్‌ను కూడా మూడుసార్లు (2021, 2022, 2023) హత్య చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే గత ఏప్రిల్ లో మెల్‌బోర్న్ కోర్టులో జరిగిన విచారణలో ఈ మూడు హత్యాయత్నం ఆరోపణలను కొట్టివేశారు. కానీ మిగిలిన హత్య, హత్యాయత్నం కేసులు మాత్రం కొనసాగుతున్నాయి. ఎరిన్ మాత్రం తాను నిర్దోషినని వాదిస్తున్నప్పటికీ వరుసగా జరిగిన ఈ ఘటనలు ఆమెపై అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వరుసగా విషాదానికి గురికావడం, అందులో ఎరిన్ పాత్ర ఉండటం అనేక భయానక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఎరిన్ తన కుటుంబ సభ్యులను పథకం ప్రకారమే విషపూరిత పుట్టగొడుగులతో చంపిందని గట్టిగా వాదిస్తున్నారు. ఆమె స్థానికంగా పుట్టగొడుగులను సేకరించి, వాటి విష ప్రభావం తెలిసే వంటలో వాడిందని ప్రాసిక్యూషన్ అనుమానిస్తోంది. ఆమె ఇంట్లో లభించిన డీహైడ్రేటర్‌ను విషపు పుట్టగొడుగులను సిద్ధం చేయడానికి ఉపయోగించినట్లు అభియోగాలు మోపారు.
అస్తి తగాదాలు…
పోలీసులు దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం ఎరిన్ ప్యాటర్సన్‌కు ఆమె మాజీ భర్త సైమన్ ప్యాటర్సన్‌తో విడాకుల తర్వాత సఖ్యత లేదు. హత్యకు గురైన గెయిల్, డాన్ ప్యాటర్సన్‌లు సైమన్ తల్లిదండ్రులు. కాగా హీథర్, ఇయాన్ విల్కిన్సన్‌లు సైమన్ అత్తామామలు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఎరిన్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.