హాస్యం ‘బ్రహ్మ’స్మి

  • కనిపించని బ్రహ్మానందం హాస్య వారసుడు
  • వెన్నెల కిషోరే ఆశ… ఆ భారం మోయగలడా?
  • పక్కకు జరిగిన సునీల్… కనిపించని ఆలీ
  • సప్తగిరి, సత్య, ప్రియదర్శి అంతంతే

తెలుగు సినిమా హాస్యానికి బ్రహ్మానందం ఒక రారాజు. తెలుగు తెరపై మూడు దశాబ్దాలు వెలుగొందారు. రేలంగి, రాజబాబు వంటి హాస్య దిగ్గజాల వారసత్వాన్ని అందుకుని తనదైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాల్లో నటించడం బాగా తగ్గిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్… బ్రహ్మానందం తర్వాత ఆయన హాస్య వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు కనిపించడం లేదని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బ్రహ్మీ ఉంటే సినిమాలు హిట్టే…
తెలుగు సినిమా చరిత్రలో బ్రహ్మానందం ఒక సువర్ణ అధ్యాయం. ఎలాంటి పాత్రలోనైనా కామెడీ పండించగల ఆయన ప్రతిభ అసామాన్యం. కేవలం ఆయన ఉంటే చాలు సినిమాలు విజయవంతమయ్యేవని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన నటించని చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. బ్రహ్మానందం కేవలం నటుడు కాదు, ఒక బ్రాండ్. ఆయన పేరు వింటేనే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేవారు. అలాంటి హాస్య బ్రహ్మ స్థానాన్ని భర్తీ చేసే నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అంతేకాక హాస్యాన్ని పండించే స్థాయిలో రచయితలు, దర్శకులు కూడా కనిపించకపోవడం తెలుగు సినిమా హాస్య రంగంలో పెద్ద లోటుగా చెప్పవచ్చు.

రేలంగి నుంచి బ్రహ్మానందం వరకు…
తెలుగు సినిమాలో హాస్యం ఒక విలక్షణమైన స్థానాన్ని కలిగి ఉంది. గతంలో రేలంగి వెంకట్రామయ్య, రాజబాబు వంటి హాస్యనటులు తమదైన ముద్ర వేశారు. రేలంగి తన సహజమైన నటన, ముఖ కవళికలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగా, రాజబాబు తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఈ వారసత్వాన్ని 1980 చివరలో స్వీకరించిన బ్రహ్మానందం, తన అసామాన్యమైన టైమింగ్, వైవిధ్యమైన పాత్రలతో హాస్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు.

1985లో శ్రీ తాతావతారం సినిమాతో…
1956లో గుంటూరు జిల్లా చాగంటివారి పాలెంలో జన్మించిన బ్రహ్మానందం, తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1985లో ‘శ్రీ తాతావతారం’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. జంధ్యాల దర్శకత్వంలో ‘అహ నా పెళ్ళంట’లోని అరగుండు పాత్ర ఆయనకు తొలి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ‘చంటబ్బాయ్’, ‘పసివాడి ప్రాణం’ వంటి చిత్రాలతో చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1250కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సాధించిన బ్రహ్మానందం, పద్మశ్రీ, ఐదు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్, సినీ మా అవార్డులు అందుకున్నారు.

బ్రహ్మానందం ప్రత్యేకత ఏమిటంటే?
ఆయన ఏ పాత్రలో నటించినా నవ్వులు పండించగలరు. ధర్మచక్రంలో ‘ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?’, దూకుడులో ‘నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్‌ఎంఎస్ చేయండి’ వంటి డైలాగులు ఆయన హాస్య శైలికి నిదర్శనం. ఆయన ఉనికి వల్లే అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయని నిర్మాతలు, దర్శకులు ఒప్పుకుంటారు.

బ్రహ్మానందం తర్వాత ఎవరు?
బ్రహ్మానందం వారసత్వాన్ని కొనసాగించే నటుల గురించి మాట్లాడితే… ప్రస్తుతం వెన్నెల కిషోర్ ఉన్నారు. కిషోర్ ప్రస్తుతం తెలుగు సినిమాలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిషోర్ టైమింగ్, సహజమైన నటన ఆయనకు ప్లస్ పాయింట్‌గా ఉన్నప్పటికీ, బ్రహ్మానందం లాంటి వైవిధ్యమైన పాత్రలను పోషించే సామర్థ్యం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనలో కొంత తక్కువగా కనిపిస్తుందని విమర్శకులు చెబుతున్నారు. సునీల్ ఒకప్పుడు ఢీ, మర్యాద రామన్న వంటి సినిమాల్లో హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా మారిన తర్వాత ఆయన హాస్య పాత్రలకు దూరమయ్యాడు.

రచయితలు, దర్శకుల లోటు…
బ్రహ్మానందం స్థానాన్ని భర్తీ చేయడం కష్టమవుతున్న ఈ సమయంలో హాస్యాన్ని పండించే స్థాయిలో రచయితలు, దర్శకులు కూడా కనిపించకపోవడం మరో పెద్ద లోటుగా నిలుస్తోంది. గతంలో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు, కేవీ ఆనంద శర్మ, ఎల్‌బీ శ్రీరామ్ వంటి రచయితలు హాస్య ట్రాక్‌లను అద్భుతంగా రాసి బ్రహ్మానందం వంటి నటుల సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నారు. చంటబ్బాయ్, జంబలకిడి పంబ వంటి సినిమాలు ఈ విషయానికి ఉదాహరణలు. బ్రహ్మానందం కోసం రచయితలు ప్రత్యేక ట్రాక్‌లు రాసేవారు. కానీ ఇప్పుడు అలాంటి సృజనాత్మక రచనలు, దర్శకత్వం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

బ్రహ్మానందం ఏమంటున్నారు?
బ్రహ్మానందం తన హాస్య వారసత్వం గురించి మాట్లాడుతూ, ‘నన్ను చూసి రచయితలు వైవిధ్యమైన పాత్రలు రాశారు. నేను వాటిని తెరపై పండించాను. నవ్వించడం కష్టమైన పని. కానీ ప్రేక్షకులు నవ్వితే అది అమృతం లాంటిది,’ అని అన్నారు. తన స్థానాన్ని భర్తీ చేయగల నటుల గురించి ఆయన ఓ సందర్భంలో, ‘కొత్త నటులు తమదైన శైలిని అభివృద్ధి చేసుకోవాలి. తమ సొంత గుర్తింపు సాధించాల’ని సూచించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *