పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని పవిత్ర స్థలాలు, తీర్థయాత్రలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అధ్యాయంలో 12 జ్యోతిర్లింగాలు, చార్ ధామ్ యాత్ర, శక్తి పీఠాలు వంటి పవిత్ర స్థలాల కూటమిని, నదీ సంగమాలు, పర్వతాలు, అడవులు వంటి పవిత్రంగా భావించే ప్రదేశాలను వివరిస్తుంది.

రెండు భాగాలుగా నూతన పుస్తకాలు…
ఈ వారం విడుదలైన నూతన పాఠ్యపుస్తకాలు మొదటి భాగాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే నెలల్లో రెండో భాగం విడుదల కానుంది. అయితే తొలగించిన మొఘలులు, ఢిల్లీ సుల్తానేట్ భాగాలు రెండో భాగంలో ఉంటాయా లేదా అనే విషయంపై ఎన్ సీఈఆర్టీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా 2022-23లో కోవిడ్ మహమ్మారి సమయంలో పాఠ్యాంశాల భారాన్ని తగ్గించే క్రమంలో తుగ్లక్, ఖిల్జీ, మమ్లూక్, లోడీ వంశాలు, మొఘల్ చక్రవర్తుల విజయాలకు సంబంధించిన విస్తృతమైన సమాచారం ఇప్పటికే తగ్గించారు. కానీ నూతన పాఠ్య పుస్తకంలో వీటికి సంబంధించిన అన్ని ప్రస్తావనలను పూర్తిగా తొలగించారు.

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రాధాన్యం…
సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’లో మగధ, మౌర్య, శాతవాహన వంటి ప్రాచీన భారతీయ రాజవంశాల గురించి భారతీయ ధర్మం ప్రాముఖ్యతను తెలిపే నూతన అధ్యాయాలు చేర్చారు. పాఠ్యపుస్తకంలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యను కూడా చేర్చారు. అందులో ఆయన భారతదేశాన్ని బద్రీనాథ్, అమర్‌నాథ్‌ల మంచు శిఖరాల నుండి కన్యాకుమారి వరకు తీర్థయాత్రల భూమిగా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా గురించి కూడా ప్రస్తావన ఉంది. ఆ మేళాలో సుమారు 66 కోట్ల మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే ఆ మేళాలో 30 మంది యాత్రికులు మరణించిన తొక్కిసలాట గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

వర్ణ వ్యవస్థ… జాతీయ పతాకం
పాఠ్యపుస్తకంలో వర్ణ-జాతి వ్యవస్థ మొదట్లో సమాజానికి స్థిరత్వాన్ని అందించినప్పటికీ, బ్రిటిష్ పాలనలో దాని కఠిన నిర్ణయాల వల్ల సమానత్వం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అటల్ సొరంగం, భారత రాజ్యాంగం వంటి అంశాలతో పాటు, 2004లో ఒక పౌరుడు జాతీయ జెండాను తన ఇంటి వద్ద ఎగురవేయడం తన హక్కు అని కోర్టులో సవాలు చేసిన సంఘటనను కూడా ప్రస్తావించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు… జెండాను ఎగురవేయడం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని తీర్పునిచ్చింది.

ఆంగ్ల పాఠ్యపుస్తకంలో…
ఆంగ్ల పాఠ్యపుస్తకంలో ఉన్న 15 కథలు, కవితలు, వివరణాత్మక రచనలలో 9 భారతీయ రచయితలవి లేదా భారతీయ నేపథ్యం, పాత్రలు కలిగినవి ఉన్నాయి. ఇందులో రవీంద్రనాథ్ టాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం, రస్కిన్ బాండ్ వంటి ప్రముఖుల రచనలు ఉన్నాయి. గతంలోని హనీకోంబ్ పాఠ్య పుస్తకంలో ఉన్న 17 రచనలలో కేవలం 4 మాత్రమే భారతీయ రచయితలవి కావడం గమనార్హం. ఈ మార్పులపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. విద్య ‘కాషాయీకరణ’గా విమర్శిస్తున్నాయి. మార్పులు చేర్పులు చేసిన పుస్తకాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *