- దాడికి వారం ముందు నుంచే ఆశ్రయం
- 15 మంది ప్రధాన సూత్రధారులని నిర్ధారణ
సహనం వందే, పహల్గామ్:
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. టెర్రరిస్టులకు పథకం రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఏకే-47, ఎం4 రైఫిళ్లతో దాడి చేసి అనేక మంది పౌరులను, భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ దాడి స్థానిక సహకారం లేకుండా సాధ్యం కాదని విచారణలో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ఆధారంగా దక్షిణ కాశ్మీర్‌కు చెందిన 15 మంది స్థానికులు ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారులని తేలింది. వీరిలో ఐదుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు, మరో పదిమందిని ప్రశ్నిస్తున్నారు.
ఆయుధాలు… ఆశ్రయంలో సహకారం
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం… ఈ 15 మంది స్థానికులు ఉగ్రవాదులకు ఆయుధాలు, ఆశ్రయం ఇతరత్రా సాయం అందించారు. దాడికి ముందు ఒక వారం పాటు పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహకరించినట్లు తెలిసింది. దాడి సమయంలో వీరి ఫోన్‌లు ఆ స్థలంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఒక చోట పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేసినట్లు స్పష్టమైన సమాచారం లభించింది.
మేం చేయలేదు…
ఈ దాడి బాధ్యతను మొదట ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) స్వీకరించినప్పటికీ, తర్వాత వారు ఈ ప్రకటనను భారత్ రూపొందించిన సైబర్ దాడిగా పేర్కొంటూ వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, ఉగ్రవాద నిరోధక చర్యలను తీవ్రతరం చేశాయి. కాగా, ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. పహల్గామ్ నుంచి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు అదనపు విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి.