మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు” అని మండిపడ్డారు. “రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలి..” అని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.

జోడో యాత్రలో వినడం నేర్చుకున్నా…

“నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మాటలు వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చాను. కానీ జోడో యాత్ర సమయంలో వినడం అంటే ఏమిటో నేర్చుకున్నాను. యాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను, భావాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. యాత్ర ప్రారంభంలో నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలేవి. క్రమేణా అవి నిశ్శబ్దంగా మారి ఎదుటివారు చెప్పేది మాత్రమే వినడం అలవాటైంది. ఈ క్రమంలో ఒక మహిళ నన్ను కలిసి తన భర్త తనను కొడుతున్నాడని చెప్పింది. ఆమె ఆ విషయం నాకు చెప్పడానికి మాత్రమే వచ్చింది. ఆమె బాధను నేను విన్న తర్వాత, ఆమెలో భయం పోయి ప్రశాంతత కనిపించింది. కేవలం వినడం ద్వారానే ఎంతో మార్పు తీసుకురావచ్చని గ్రహించాను. ప్రజలు చెప్పేది వినడం అనేది ఎంతో ముఖ్యం” అని ఆయన అన్నారు.

సోషల్ మీడియాతో అంతా మారిపోయింది…

“మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారిపోయింది… ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు” అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. “భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచా. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలుపెట్టా. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాన”ని రాహుల్ గాంధీ అన్నారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *