భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శనివారం భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానం

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమ పథకాలను, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
రైతులకు పెద్దపీట
వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామని, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుపై రూ. 500 అదనపు బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
యువతకు ఉద్యోగావకాశాలు
యువతకు నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని స్థాపించామని, తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
పెట్టుబడులు, అభివృద్ధి
దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పెట్టుబడి సమ్మిట్ల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
మహిళా సంక్షేమం
మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులను కోటికి పెంచడమే కాకుండా వారిని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు.