- ట్రంప్, మస్క్‌పై ప్రజల తిరుగుబాటు
- అమెరికాలో ‘హ్యాండ్స్ ఆఫ్’ నిరసనలు
- న్యూయార్క్, చికాగో వంటి చోట్ల ఆందోళనలు
- ‘ట్రంప్ సిగ్గు సిగ్గు’ అంటూ లక్షలమంది స్లోగన్స్
- ట్రంప్, మస్క్ విధానాలపై జనాగ్రహం
సహనం వందే, న్యూయార్క్:
అమెరికాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా వీధుల్లో అధ్యక్షుడు ట్రంప్, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. “హ్యాండ్స్ ఆఫ్” ఉద్యమం ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా మారింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై టారీఫ్ లు విధించటంతో అంతర్జాతీయంగా ట్రంప్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కూడా సుంకాల టారిఫ్ ను 34 శాతం పెంచడంతో, రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మరోవైపు ఆ దేశంలో ట్రంప్ విధానాలపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.
1200 ప్రాంతాల్లో నిరసనల వెల్లువ…
ఈ నిరసనలు వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సిటీ, బోస్టన్, లాస్ ఏంజిల్స్, చికాగో వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా చోటు చేసుకున్నాయి. 1200కి పైగా ప్రదేశాలలో నిర్వహించినట్లు సమాచారం. ప్రదర్శనకారులు “హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ” వంటి నినాదాలతో తమ నిరసనలను తెలియజేశారు.

వివాదాస్పద నిర్ణయాలతో అసంతృప్తి…
ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానాలు, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన నిర్లక్ష్యం జనంలో తీవ్ర అసహనాన్ని రేకెత్తించాయి. మస్క్ సామాజిక మాధ్యమాల వినియోగం, వ్యాపార తీరు సైతం విమర్శలకు గురవుతున్నాయి. ఈ ఇద్దరి చర్యలు సమాజంలో చీలికకు దారితీస్తున్నాయని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ తన వివాదాస్పద విధానాలను ఉపసంహరించుకోవాలని, మస్క్ తన సామాజిక మాధ్యమాల వినియోగాన్ని బాధ్యతాయుతంగా మార్చుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సుంకాలు (టారిఫ్ లు), ఎలన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ద్వారా చేపట్టిన ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకారులు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, మెడికైడ్ వంటి సామాజిక సేవలపై ఈ చర్యల ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి సవాల్…
ట్రంప్, మస్క్ అధికార దుర్వినియోగం అమెరికా ప్రజాస్వామ్యానికి సవాల్ విసురుతోంది. వారి చర్యలు దేశాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ వద్ద జరిగిన ర్యాలీలో హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ అధ్యక్షురాలు కెల్లీ రాబిన్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వ్యక్తిగత హక్కులపై దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్ మిచెల్ వూ మాట్లాడుతూ, బెదిరింపు వంటి ప్రభుత్వ చర్యలను తాము అంగీకరించలేమన్నారు. ప్రజల ఆగ్రహం పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ నిరసనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. ఈ నిరసనలు అమెరికా రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తాయో వేచి చూడాలి. ప్రజల ఆగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తే ట్రంప్, మస్క్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.