ఆ దిగ్గజాలకు సినీ వారసత్వం లేక తెలుగు సినీ ఇండస్ట్రీ వెలవెల
– నేటి హీరోల్లో లోపించిన మాస్ ఇమేజ్… ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంలో వైఫల్యం
– సినిమా వ్యాపారమా? వారసత్వమా? నేటి హీరోల దారి ఎటు?
– ఎన్టీఆర్, చిరంజీవిల ప్రభావం… నేటి తరం హీరోలు అందుకోలేని శిఖరం!
– ఎమోషనల్ కనెక్షన్… నేటి హీరోలు నేర్చుకోవాల్సిన పాఠం!
– గత్యంతరం లేక ఏది తీస్తే అది చూడాల్సిన దుస్థితి…
సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీ రామారావు ఒక ఊపు ఊపి, తనదైన శైలితో సునామీ సృష్టించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ లెగసీని అందుకుని, తెలుగు సినీ రంగంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు తెలుగు సినిమాకు దొరికిన మణిరత్నాలు. ఎన్టీఆర్ సినిమా రంగంలో కీలక స్థానంలో ఉన్న సమయంలోనే, చిరంజీవి ఆయనకు సరిసమానంగా ఎదిగి మెగాస్టార్‌గా ఆవిర్భవించారు. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరి తర్వాత ఆ స్థాయి లెగసీని అందుకునే వారసుడు ఎవరన్న ప్రశ్న తెలుగు సినీ చిత్రసీమలో పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది. మరో ఎన్టీఆర్, మెగాస్టార్ పుట్టడా? ప్రస్తుత తరం హీరోలు ఎందుకు ఈ స్థాయిని అందుకోలేకపోతున్నారు? ఆనాటి మెరుపులు ఈనాటి సినిమా ఇండస్ట్రీలో ఏమైపోయాయి?
హీరోల గుంపున్నా గుభాళింపు సున్నా…
తెలుగు సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. చిరంజీవి కంటే వీళ్లు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి మాస్ ఆదరణ, నటనలో గొప్పతనం, సినిమా పరిశ్రమపై శాశ్వత ముద్ర వేసే సామర్థ్యాన్ని వీరిలో ఎవరూ సాధించలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. “ఎన్టీఆర్, చిరంజీవి ఒక ఎమోషన్‌ను సృష్టించారు. వాళ్లు సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇప్పటి హీరోలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నా, ఆ ఎమోషనల్ కనెక్షన్ సాధించడంలో విఫలమవుతున్నారు” అని ఓ సీనియర్ సినీ విమర్శకుడు అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమ కలతప్పింది.
ఎన్టీఆర్, చిరంజీవీల ప్రత్యేకత…
ఎన్టీఆర్ తన నటనతో, సామాజిక సందేశాలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాక, సామాన్యుడి గొంతుకగా మారాయి. అదే విధంగా, చిరంజీవి తన మాస్ ఇమేజ్, డ్యాన్స్, యాక్షన్‌తో తెలుగు సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. వీరిద్దరూ కేవలం హీరోలుగానే కాక, తెలుగు సినిమా సంస్కృతికి ప్రతీకలుగా నిలిచారు. కానీ ప్రస్తుత హీరోలు ఈ స్థాయిని చేరుకోలేకపోతున్నారు.
ఏమైంది వీళ్లకు?
సినీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎన్టీఆర్, చిరంజీవి స్థాయిని ప్రస్తుత హీరోలు అందుకోలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది, సామాజిక సందేశం ప్రస్తుత హీరోల సినిమాల్లో కనిపించడం లేదు. ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు సామాజిక సమస్యలను ప్రతిబింబించి, ప్రేక్షకులతో లోతైన బంధాన్ని ఏర్పరిచాయి. ఇప్పటి సినిమాలు ఎక్కువగా వినోదం, విజువల్ గ్రాండ్‌నెస్‌పై ఆధారపడుతున్నాయి. రెండోది, మారిన ప్రేక్షకుల అభిరుచి. డిజిటల్ యుగంలో ప్రేక్షకులు త్వరిత వినోదాన్ని కోరుకుంటున్నారు. దీంతో హీరోలు లాంగ్-టర్మ్ లెగసీ కంటే షార్ట్-టర్మ్ హిట్స్‌పై దృష్టి పెడుతున్నారు. మూడోది, పాన్-ఇండియా ఒత్తిడి. దేశవ్యాప్త ఆదరణ కోసం స్థానిక ఎమోషన్ కనెక్షన్ తగ్గుతోంది. ఇంకా, మార్కెటింగ్‌పై ఉన్న శ్రద్ధ కంటెంట్‌పై కనబరచని రచయితలు, దర్శకులు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కళ కోసం పరితపించని నేటి తరం అగ్ర హీరోలు ఈ వైఫల్యానికి కారణమవుతున్నారు.
ఆస్థానం ఇవ్వడానికి జనం విముఖత…
ప్రేక్షకులు ఇప్పటి హీరోలకు ఎన్టీఆర్, చిరంజీవి స్థాయిని ఇవ్వలేకపోవడానికి కారణం వారి సినిమాల్లో ఆ ఎమోషనల్ డెప్త్ కొరవడటమే. “ఎన్టీఆర్ సినిమా చూస్తే ఒక ఉద్వేగం కలిగేది. చిరంజీవి సినిమాలో ఒక ఎనర్జీ ఉండేది. ఇప్పటి సినిమాలు విజువల్‌గా గొప్పగా ఉన్నా, ఎమోషన్స్ కనిపించడం లేదు. గత్యంతరం లేక, మరో ప్రత్యామ్నాయ వినోద మాధ్యమం లేక, ఏదో ఒకటి అని చూడాల్సి వస్తుంది” అని ఓ సినీ అభిమాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చిరంజీవిలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాత్రలు పోషించగా, ఇప్పటి హీరోలు కమర్షియల్ ఫార్ములాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శ ఉంది. డబ్బు సంపాదించడమే పరమావధిగా మారింది. సినిమా ఎంత వసూలు చేసిందన్నదాని ఆధారంగానే అంచనా వేస్తున్నారు. థియేటర్లను కబ్జా చేసి, వేలాది షోలు ప్రదర్శించి, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వారం రోజుల్లో పెట్టుబడిని రాబట్టుకుని, భారీగా డబ్బు సంపాదించి, అదే ఘన విజయంగా చెప్పుకోవడంతో ప్రేక్షకులు వారిపట్ల ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతున్నారు.
ఇప్పటి స్టార్ హీరోల్లో ఎవరికి అవకాశం ఉంది?
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ గుర్తింపు సాధించారు. ‘పుష్ప’తో అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు. అయినా, “ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తున్నాడు, కానీ చిరంజీవి లాంటి మాస్ ఎమోషన్ రేకెత్తించడంలో వెనుకబడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్‌లో పెద్ద ఎన్టీఆర్ నటన కనిపిస్తుంది, కానీ ఆ స్థాయి పట్టు ఇంకా సాధించలేదు” అని ఓ నిర్మాత చెప్పారు. ఈ హీరోల్లో ఎవరైనా ఆ లెగసీని అందుకోగలరా? లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
తెలుగు సినిమాకు కొత్త దశ దిశ కావాలి…
ఎన్టీఆర్, చిరంజీవి స్థాయిని అందుకోవాలంటే, ఇప్పటి హీరోలు కేవలం బాక్సాఫీస్ విజయాల కంటే సమాజంతో మమేకమై, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే సినిమాలు తీయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. పాన్-ఇండియా హవా నడుస్తున్నా, తెలుగు సినిమా ఆత్మను కాపాడుకునే లెగసీ వారసుడు ఎవరన్నది ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. మార్కెటింగ్‌పై దృష్టి పెట్టి, కంటెంట్‌ను విస్మరిస్తున్న రచయితలు, దర్శకులు, కళ కోసం ఆరాటపడని హీరోలు… ఈ స్థితికి కారణమా? దీనికి సమాధానం కోసం తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.