– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం
సహనం వందే, లక్నో:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, పార్టీ తనను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేసిందని ఆయన నొక్కి చెప్పారు.
మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 17న పదవీ విరమణ ప్రకటన చేస్తారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ విషయంపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మోదీ తర్వాతి ప్రధానమంత్రి మహారాష్ట్ర నుంచి ఉంటారని కూడా రౌత్ పేర్కొన్నారు. ఈ వాదనలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. “మోదీ పదవీ విరమణకు సంబంధించి ఎలాంటి ఆలోచన అవసరం లేదు. 2029లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగుతారు” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, కొందరు యోగి ఆదిత్యనాథ్‌ను భవిష్యత్ ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు యోగి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని. పార్టీ నన్ను ఇక్కడి ప్రజల సేవ కోసం నియమించింది. రాజకీయాలు నాకు పూర్తి స్థాయి వృత్తి కాదు” అని అన్నారు.