తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా ఉందని, పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ను ‘బడా జూట్’ బడ్జెట్‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయటా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన అబద్ధాలను ఆయన ఎండగట్టారు.
* లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి, కేవలం 20 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం మోసమని అన్నారు. 5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని, మిగతా 15 లక్షలకు మహిళలే వడ్డీ కడుతున్నారని ఆయన తెలిపారు.
* స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 75 రూపాయలు ఇస్తున్నామని చెప్పి, నిజానికి 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.
* బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇస్తే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బడ్జెట్‌లో చెప్పడం అబద్ధమని అన్నారు.
మహాలక్ష్మి పథకం, చేయూత పథకం, రుణమాఫీ, తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని హరీష్ రావు ఆరోపించారు. వృద్ధులు, గీత, చేనేత, ఎయిడ్స్ రోగులను కూడా మోసం చేసిందని దుయ్యబట్టారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్న పింఛన్లను రెండు నెలలు ఎగ్గొట్టారని, లక్షా 50 వేల పింఛన్లు తగ్గించారని తెలిపారు.
ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని హరీష్ రావు ఆరోపించారు. గత బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి, ఈసారి కూడా అదే మాట చెప్పారని, కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయం కాంగ్రెస్ పాలనలో తగ్గిపోయాయని తెలిపారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారని, ఎక్సైజ్ ఆదాయం కోసం విపరీతంగా మద్యం ధరలు పెంచారని హరీష్ రావు ఆరోపించారు. భూముల అమ్మకం, ఎఫ్ఆర్బీఎం అప్పులు పెంచారని తెలిపారు. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారని, బీసీ సబ్ ప్లాన్ విషయంలోనూ మోసం చేశారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలోనూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని హరీష్ రావు ఆరోపించారు. నరేగా, మిడ్ డే మీల్స్, మహిళా పథకాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలోనూ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. భట్టి బడ్జెట్ ‘బడా జూట్’ బడ్జెట్ అని, దీని ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందని హరీష్ రావు తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ బడ్జెట్ ‘బడా జూట్’.. అబద్ధాల పుట్ట: హరీష్ రావు

0