సహనం వందే, హైదరాబాద్:
“కొలువుల పండుగ” సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మీ కల నేడు నిజమైంది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి తావులేదు…
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ నియామకాలు ఇంతకాలం పెండింగ్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. “ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడింది. కానీ, అమరుల ఆశయాలు నెరవేరలేదు. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే 57,924 ఉద్యోగాలను భర్తీ చేశాం” అని ఆయన స్పష్టం చేశారు.
విమర్శకులకు ఘాటుగా సమాధానం…
తమ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్న వారికి రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. “పదేళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోయాయి. పేదింటి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? పది నెలల్లో మేం చేసిన పని, పదేళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు?” అని ఆయన ప్రశ్నించారు.
పారదర్శక పాలన, ప్రజల సంక్షేమమే ధ్యేయం…
తమ ప్రభుత్వం పారదర్శక పాలన, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. “హైదరాబాద్లో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్ తెచ్చాం. ప్రజలకు పారదర్శక పాలన అందించడమే మా లక్ష్యం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి పథకాలు ప్రజల కోసమే” అని ఆయన అన్నారు.
మిస్ యూనివర్స్ పోటీలతో తెలంగాణకు గుర్తింపు…
మిస్ యూనివర్స్ పోటీలపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. “ఇది పర్యాటక రంగానికి గొప్ప అవకాశం. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వందల కోట్ల ఆదాయం వస్తుంది” అని ఆయన వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి కృషి...
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “గత ప్రభుత్వంలా కాకుండా, పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం” అని ఆయన అన్నారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర – 57,924 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో రేవంత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు!
