- ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఆడుతున్న అభిమానులు
- గేమింగ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక విధ్వంసం
- ముందస్తు డిజిటల్ కొనుగోళ్ల అంచనా రూ. 15 వేల కోట్లు
- దీని విడుదలతో ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం
- గేమ్ తయారీలో భారతదేశానికి కూడా భాగస్వామ్యం
- 13 ఏళ్ల నిరీక్షణకు తెర… అసలు కథ ఏంటంటే…?
సహనం వందే, హైదరాబాద్:
ఒక వీడియో గేమ్ కోసం ఉద్యోగానికి సెలవు పెట్టడం ఎప్పుడైనా చూశారా? ఒక గేమ్ ఆడటానికి గంటకు రూ.250 చెల్లించి గేమింగ్ కేఫ్‌లకు పరుగులు తీయడం చూశారా? అంతేకాదు.. ఇంకా విడుదల కాకముందే కోట్ల మంది డబ్బులు చెల్లించేంత క్రేజ్ ఉంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. గ్రాండ్ తెఫ్ట్ ఆటో సిక్స్ (జీటీఏ 6) దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదల కావడంతో గేమింగ్ ప్రపంచంలో పండగ వాతావరణం నెలకొంది. భారత్‌లోనూ గేమింగ్ కేంద్రాలు అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్లు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ సందడిలో భాగమయ్యారు.
ఇది సినిమా కాదు… ఓటీటీ సిరీస్ కాదు… వర్చువల్ గేమ్
2013 సెప్టెంబరులో జీటీఏ 5 వచ్చిన తర్వాత కొత్త భాగం కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ నెల 19న (గురువారం) జీటీఏ 6 విడుదలైంది. ఇది సినిమా కాదు, ఓటీటీ సిరీస్ కాదు.. మనమే పాత్రను నడిపించే వీడియో గేమ్. నగరంలో తిరగడం, కార్లు, బైకులు నడపడం, పనులు పూర్తి చేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం, నేర ప్రపంచంలోని వ్యక్తులను ఎదుర్కోవడం ఇందులో ఉంటాయి. జేసన్, లూసియా అనే పాత్రలు ఒక దోపిడీ ప్రయత్నంతో మొదలై నేర కుట్రలో చిక్కుకుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాను పోలిన లియోనిడా, అందులో వైస్ సిటీ నేపథ్యంగా ఈ కథ సాగుతుంది.
ఉద్యోగాలకు సెలవులు.. గేమింగ్ కేఫ్‌లకు క్యూ
గేమ్ విడుదలైన గురువారం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ సందడి కనిపించింది. కొందరు ఉద్యోగాలకు సెలవులు పెట్టారు. మరికొందరు రాత్రంతా మేల్కొని ఎదురుచూశారు. అమెరికాలో కొన్ని సంస్థలు ప్రత్యేక గేమింగ్ సెలవులు కూడా ప్రకటించాయి. రాయిటర్స్ కథనం ప్రకారం ఢిల్లీ, బెంగళూరు, శ్రీనగర్‌లలో గేమింగ్ కేంద్రాలకు అభిమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన జాకబ్ జోయెల్ అనే ఐటీ ఉద్యోగి సెలవు పెట్టి కేఫ్‌లో పెద్ద తెరపై ఆడారు. దేశంలో సుమారు 55 కోట్ల మంది వీడియో గేమ్‌లు ఆడుతున్నా, చాలామంది మొబైల్లో ఆడతారు. జీటీఏ 6 ప్రత్యేక పరికరాల్లోనే ఉండటంతో కేఫ్‌లకు డిమాండ్ పెరిగింది. కొన్నిచోట్ల ఆదివారం వరకు ముందస్తు బుకింగ్‌లు జరిగాయి.
మోడీ స్పందన.. రూ. 15 వేల కోట్ల అంచనా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జీటీఏ స్ఫూర్తితో రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2013లో జీటీఏ 5 వచ్చినప్పటి భారత్‌కు, 2026లో జీటీఏ 6 వచ్చినప్పటి భారత్‌కు మధ్య మార్పులను పోలుస్తూ, భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోందని వ్యాఖ్యానించారు. వ్యాపార లెక్కల విషయానికి వస్తే, విడుదలకు ముందే దాదాపు 1.7 కోట్ల డిజిటల్ ముందస్తు కొనుగోళ్లు జరిగినట్లు సెన్సార్ టవర్ అంచనా వేసింది. వీటి విలువ సుమారు దాదాపు రూ.15 వేల కోట్లు. ఇందులో ప్లేస్టేషన్ వాటా సుమారు 75 శాతం, ఎక్స్‌బాక్స్ వాటా 25 శాతంగా నివేదికలు తెలిపాయి.
ఎక్కడ ఆడొచ్చు.. ధరలు, జాగ్రత్తలు
ప్రస్తుతం ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ పరికరాల్లో ఈ గేమ్ అందుబాటులో ఉంది. ప్లేస్టేషన్ 4లో ఆడలేరు, కంప్యూటర్లకు ఇంకా అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు. ప్లేస్టేషన్ డిజిటల్ స్టోర్ ప్రకారం సాధారణ ఎడిషన్ ధర రూ.5,999, అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499. డౌన్‌లోడ్‌కు ఇంటర్నెట్ అవసరం కానీ, ప్లేస్టేషన్ సమాచారం ప్రకారం ప్రధాన ఆటను ఆఫ్లైన్లోనూ ఆడొచ్చు. హింసాత్మక దృశ్యాలు, మాదకద్రవ్యాల ప్రస్తావనలు, నగ్నత్వం, లైంగిక అంశాలు వంటి హెచ్చరికలు ఉన్నందున పెద్దలకే అనువైనది.
భారతదేశానికి భాగస్వామ్యం
ఈ ప్రపంచ ప్రఖ్యాత గేమ్ తయారీలో భారతదేశానికి కూడా భాగస్వామ్యం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అమెరికాకు చెందిన రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బృందాలతో పాటు బెంగళూరులోని రాక్‌స్టార్ ఇండియా కేంద్రం కూడా ఇందులో పనిచేసింది. మన దేశం కేవలం గేమ్స్ ఆడే మార్కెట్ మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి గేమ్స్ తయారీలోనూ భాగస్వామిగా ఎదుగుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ. బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించిన వివరాల ప్రకారం.. రాక్‌స్టార్ ఇండియా బెంగళూరు కేంద్రంలో పనిచేసిన 1600 మందికి పైగా నిపుణులు జీటీఏ 6 రూపకల్పనలో భాగమయ్యారు.