- సమస్యలపై సాంకేతిక సమరానికి పిలుపు
- ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశం
- దరఖాస్తుకు ఈ నెల 30 డెడ్‌లైన్
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న 7 ప్రాధాన్యతా సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌ను లాంచ్ చేసి, నూతన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలను నేరుగా ఆహ్వానిస్తోంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వ కాంట్రాక్టర్లుగా మారే అరుదైన అవకాశం
ఈ ఛాలెంజ్ ద్వారా ఎంపికయ్యే స్టార్టప్‌లకు ప్రభుత్వ శాఖలతో నేరుగా కలిసి పనిచేసే సువర్ణావకాశం లభిస్తుంది. వారు పైలట్ ప్రాజెక్ట్‌లను చేపట్టి, సరైన పరిశీలన తర్వాత భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రొక్యూర్మెంట్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకంలో పాల్గొనాలనుకునే వ్యక్తిగత ఆవిష్కర్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యాసంస్థలు ఈ నెల 30వ తేదీ లోగా tisc.telangana.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

రైతుల కోసం సోలార్ పంప్‌లు, రెట్రోఫిట్ కిట్లు
మొదటి దశలో ఎంచుకున్న 7 ప్రధాన రంగాల్లో వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోలార్ ఆధారిత సాగునీటి వ్యవస్థను లీడ్ ఛాలెంజ్‌గా తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా సాధారణం కంటే 30 శాతం తక్కువ ధరకే లభించేలా డీప్ బోర్ వెల్స్ కోసం రెట్రోఫిట్ కిట్లను లేదా సరసమైన సోలార్ పంప్‌లను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దొంగతనం జరగకుండా ఉండే సోలార్ ప్యానెల్స్, ట్యాంపర్ ప్రూఫ్ గ్రిడ్ మీటరింగ్ విధానాలను ఆవిష్కరించాలి. ప్రతి రైతుకూ ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో సాగునీరు అందించి కరెంటు భారాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఫుడ్ టెస్టింగ్ కిట్లు… రోడ్డు గుంతలకు చెక్
రెండో ప్రధాన అంశం ఆహార భద్రత, పర్యావరణం. రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆహార కల్తీని వేగంగా గుర్తించే ఫుడ్ అడల్టరేషన్ టెస్టింగ్ కిట్లు, వంటశాలలలో పారిశుధ్యాన్ని పర్యవేక్షించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయాలి. ఇక పట్టణ మౌలిక సదుపాయాల కోసం చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను కనిపెట్టే శాటిలైట్ వ్యవస్థలు, రోడ్లపై గుంతలను ఆటోమేటిక్‌గా గుర్తించే వెహికల్-మౌంటెడ్ కెమెరాలు, వర్షాకాలాన్ని తట్టుకునే మన్నికైన రోడ్డు మరమ్మత్తు సామగ్రిని కోరుతున్నారు.
నీడిల్-ఫ్రీ హిమోగ్లోబిన్ పరికరాలు, పంటల మ్యాపింగ్
ఆరోగ్యం, విద్య, సర్వే రంగాలలో కూడా వినూత్న టెక్నాలజీలకు ఆహ్వానం పలికారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సులభంగా వాడేలా ఎలాంటి సూది అవసరం లేని హ్యాండ్‌హెల్డ్ హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ డివైజ్ తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల పిల్లల రీడింగ్ స్కిల్స్ అంచనా వేసే ఏఐ-ఎనేబుల్డ్ తెలుగు రీడింగ్ టూల్స్, అలాగే సర్వే నంబర్ల వారీగా కొన్ని వారాల్లోనే విత్తనాలు వేసిన పంటలను మ్యాపింగ్ చేసే శాటిలైట్ అప్లికేషన్లను ఆవిష్కరించాలి.
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శన
ఈ ఛాలెంజ్ ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో ఈ డిసెంబర్లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. సమస్యకు చూపే పరిష్కారం, ఇన్నోవేషన్ ప్రత్యేకత, సాంకేతిక సన్నాహకత, ప్రజలపై చూపే ప్రభావం ఆధారంగా నిపుణులు దరఖాస్తులను మూల్యాంకనం చేస్తారు. టీ-హబ్, టీ-వర్క్స్, వి-హబ్, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్, రిచ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు.